విజయనగరం టౌన్: దసరా, శరన్నవరాత్రి మహోత్సవాలకు సొంత జిల్లాలకు రైళ్ల ద్వారా వద్దామనుకునే ప్రయాణికులకు తీవ్ర నిరాశే మిగిలింది. 60 రోజులు ముందుగానే రిజర్వేషన్ బుకింగ్‌లు ప్రారంభం కావడం, అంతా ఆన్‌లైన్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో రిజర్వేషన్ కౌంటర్‌కి వెళ్లి క్యూలైన్‌లో నిల్చొని, తమ మొబైల్ ద్వారా టికెట్ బుకింగ్ చేసేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. సౌత్‌కోస్ట్ రైల్వే డివిజన్ విజయనగరం మీదుగా ప్రతీ రోజు 200 రైళ్లు అప్ అండ్ డౌన్‌లో తిరుగుతుంటాయి. ఇవికాకుండా పండగ పర్వదినాల్లో సౌత్‌కోస్ట్ జోన్ అధికారులు ప్రత్యేకంగా 19 రైళ్లను అప్ అండ్ డౌన్‌లో ఏర్పాటు చేశారు. అయితే వీటిలో ఏ ఒక్క రైలుకు రిజర్వేషన్ బెర్త్‌లు ఖాళీల్లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తత్కాల్ కోసం రాత్రంతా రిజర్వేషన్ కౌంటర్‌ల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాపురించింది. 60 రోజుల ముందు రిజర్వేషన్‌లు చేయించుకునేందుకు వచ్చేవారికి కూడా కొద్ది నిమషాల్లోనే రైళ్లన్నీ పుల్ అయిపోతూ వెయిటింగ్ లిస్టులు కనిపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైలు నెంబర్ 07268/07267 జనసాధారణ రైలు మెమూ స్పెషల్ విశాఖ నుంచి పార్వతీపురం వరకూ మాత్రమే ఈ నెల 20 వరకూ నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి, పార్వతీపురం మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 12.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుతుంది. విశాఖ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సిపురం హాల్ట్, పార్వతీపురం వరకూ మాత్రమే ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
పైడితల్లి పండగకు ప్రత్యేక రైళ్లు ఉన్నట్టా? లేనట్టా?
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు పండగకు గతంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఈ ఏడాది సౌత్ కోస్ట్ రైల్వేగా మారిన తర్వాత ఈ ఏడాది పైడితల్లి పండగకు ప్రత్యేక రైళ్లు ఉన్నట్టా? లేనట్టా? అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 26, 27 తేదీల్లో నిర్వహించే తొలేళ్లు, సిరిమాను సంబరాలకు లక్షలాది మంది భక్తులు విజయనగరానికి తరలివస్తారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పండగ నేపథ్యంలో అమ్మజాతరకు వచ్చే భక్తులకు రైల్వే అధికారులు ఈ ఏడాది ప్రత్యేక రైళ్లను త్వరితగతిన కేటాయించాలని ఆ దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
రెండు నెలల వరకూ వెయిటింగ్ లిస్టే దర్శనం
20వ తేదీ వరకూ
విశాఖ–పార్వతీపురం వరకు
జన సాధారణ రైలు
జనరద్దీని బట్టి ప్రత్యేక రైళ్లను వేస్తూ ఉండాలి
పైడితల్లి పండగకు ప్రత్యేకరైళ్లు ఉన్నట్టా? లేనట్టా?
అదనపు రైళ్లను కేటాయించాలి
దసరా, సంక్రాంతి పర్వదినాల్లో రిజర్వేషన్‌లు ఖాళీ ఉండవు. అటువంటి సమయాల్లో అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను రద్దీ ప్రాంతాల్లో నడిపే విధంగా రైల్వే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. దీనిపై ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. రానున్న పైడితల్లి అమ్మవారి పండగకు ఒడిశా నుంచి అధికంగా భక్తులు తరలివస్తారు. జనసాధారణ రైళ్లను నాలుగైదు వేస్తే బావుంటుంది.
– పావని పాత్రో, ప్రయాణికురాలు


