● ఐదో రోజుకు చేరిన వైద్యారోగ్య కాంట్రాక్టు
సిబ్బంది సమ్మె
పార్వతీపురం రూరల్: వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద వారు వినూత్న రీతిలో నిరసన గళమెత్తారు. రహదారికి ఇరువైపులా మానవహారంగా ఏర్పడిన సిబ్బంది.. చేతులు పైకెత్తి సంకెళ్లు వేసుకున్నట్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు నూరు శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్‌సీ కార్డులు మంజూరు చేయాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్, పార్వతీపురం యూనియన్ జిల్లా ప్రతినిధి ఎస్.నారాయణరావు, కన్వీనర్ దిలీప్, కో–చైర్మన్ సురేష్, వైస్ చైర్మన్ రాజ్యలక్ష్మితో పాటు ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
తన కుమార్తెతో కలిసి సమ్మెలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగి


