● రోడ్డు కోసం నిరసన
ఎమ్మెల్యేగారూ.. మా కష్టాలు చూడండి... రేషన్ సరుకుల కోసం రాళ్లదారిలో కిలోమీటర్ల దూరం నడక యాతన తప్పడం లేదు.. పల్లె పండగ పేరుతో రోడ్లు నిర్మిస్తామని చెబుతున్నారు... ఎక్కడ వేస్తున్నారో మాకు తెలియడం లేదు.. మా ఊరు రోడ్డు ఒక్కసారి చూడండి... కష్టాలను గుర్తించి తక్షణమే రోడ్డు నిర్మించండి అంటూ గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ దేరుగుండ గిరిజనులు ఆందోళన చేశారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తోటి గిరిజనుల కష్టాలు గుర్తించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా రోడ్డు నిర్మించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మండంగి సన్యాసిరావు, తోయక ఈశ్వరరావు, మండంగి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
– గుమ్మలక్ష్మీపురం
పార్వతీపురం రూరల్: ఈవీఎంల భద్రతలో ఇసుమంతైనా లోపం ఉండకూడదని, అడుగడుగునా కట్టుదిట్టమైన నిఘా కొనసాగాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ఏర్పాట్లను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గస్తీ విధానాలు, సీసీటీవీల పర్యవేక్షణను నిశితంగా పరిశీలించి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు. అనుమతి ఉన్న అధికారులైనా సరే.. వారి రాకపోకల సమయాలను తప్పనిసరిగా లాగ్ బుక్‌లో నమోదు చేయాలని నిబంధన విధించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎస్పీ మాధవ్ రెడ్డి


