● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేద్దామని, అన్ని స్థానాల్లోనూ విజయపతాకం ఎగురవేద్దామని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని తన గృహం వద్ద సాలూరు మున్సిపాలిటీలోని 21, 23, 24, 25, 26 వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులకు పార్టీ ఐడీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు మోసపూరిత పాలన మధ్య తేడాను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి మహిళకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,500 అందజేయగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్న హామీని విస్మరించి మోసం చేసిందన్నారు. నిరుద్యోగభృతి, ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వకుండా నిరుద్యోగులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ అని ప్రజలు గుర్తించారని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడ్డి రమణ, కర్రి శేషు, అల్లు అప్పమ్మ, పిట్టా వాసు, బీసపు బాలకృష్ణ, కస్తూరి రామకృష్ణ, సింగారపు ఈశ్వరరావు, బలరాం, రౌతు సురేష్, కర్రి అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.


