పార్వతీపురం రూరల్: జిల్లాలో నూతనంగా నిర్మించిన 11 ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్’లను మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్, 15వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులు కలిపి మొత్తం రూ.406.34 లక్షలతో ఈ భవనాలను నిర్మించారు. స్థానికంగా జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి పాల్గొని శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్ కమ్యూనికేబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధులను ముందస్తుగా గుర్తించి, గ్రామీణ ప్రజలకు స్థానికంగా సత్వర ప్రాథమిక వైద్య సేవలు అందించడమే ఈ క్లినిక్‌ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కొత్తగా పాలకొండ నియోజకవర్గంలో 7, సాలూరులో 2, కురుపాంలో 2 చొప్పున క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పి.విజయలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు, ప్రొగ్రాం మేనేజర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని రైతులందరికీ నిర్దేశిత గడువులోగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం మాట్లాడారు. అక్టోబర్, నవంబర్ నెలల పాస్‌పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, మాన్యువల్ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్‌ఎస్ వినతులపై సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు భూ సేకరణను వేగవంతం చేయాలని సూచించారు.


