● ఎయిర్‌పోర్టు వేదికపై జీఎంఆర్‌కు మాట్లాడే అవకాశం కట్
● ఆయన వాస్తవాలు చెబితే చంద్రబాబు
పరువు పోతుందన్న భయం
● వై.ఎస్.జగన్‌ను పొగుడుతారన్న అనుమానం?
● నిర్మాణ శ్రమ వివరించేందుకు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
భోగాపురం విమానాశ్రయం పనులు ఎవరు ప్రారంభించారు.. ఎవరు మొదలెట్టారు.. ఎవరి హయాంలో ఎక్కువ పనులు అయ్యాయనేది లోకవిదితం. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకోవడం, ఎలాంటి పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2019 ఎన్నికల ముందు కేవలం ఓట్లకోసమే శంకుస్థాపన చేసేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును జెట్ వేగంతో పరుగులెత్తించి కోవిడ్ వంటి విపత్తు సమయంలో సైతం పనులు వేగవంతంగా పూర్తిచేసిన విషయం అందరికీ గుర్తున్నదే. అయితే, విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ఆ శాఖకు సంబంధం లేని పవన్‌కల్యాణ్, లోకేశ్ వంటివారు సైతం వేదికమీద ప్రసంగించారు. కానీ... దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రమోటర్ గ్రంథి మల్లికార్జునరావు (జీఎమ్మార్)కు మాత్రం మైక్ ఇవ్వలేదు. ఆయనతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వేదికమీద ఉన్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము ఎలాంటి శ్రమపడ్డారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది వంటి కొన్ని పాయింట్లు అయినా వారు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సజ్జన్ జిందాల్ ఏమన్నారో గుర్తొచ్చిందా?
వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో జీఎమ్మార్ మాట్లాడుతూ.. గతంలో తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించామని, నేడు భోగాపురం ప్రాజెక్టు చేపట్టామని, తండ్రీకొడుకుల సారథ్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని చెప్పారు. దాంతో బాటు ఈ ప్రాజెక్టుకు బాగా సహకారం అందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, పలు పాలనాపరమైన అనుమతులు తెచ్చి పనులకు ఒక రూపు ఇచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ అనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 86 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పాత్ర ఇందులో కొద్దిగానే ఉందన్నది అందరూ బయటకు చెప్పకపోయినా లోలోన అంగీకరిస్తున్న అంశం అన్నమాట. ఇక కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నాటి వైఎస్ జగన్ సర్కారు భూసేకరణ, పలు అనుమతులు తీసుకొచ్చి సజ్జన్ జిందాల్, వైఎస్ జగన్ కలిపి దానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిపోగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. అయితే, మళ్లీ తామే ఆ సంస్థను ఉద్దరిస్తున్నట్లు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సజ్జన్ జిందాల్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సంచలనం అయ్యింది. మీరిచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొదలైంది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ అయన ట్విట్టర్లో చేసిన పోస్టు అందరూ చూసి ఓహో.. ఇదంతా వైఎస్ జగన్ కాలంలోనే ఒక రూపు వచ్చిన ప్రాజెక్టా.. దానికి మళ్లీ చంద్రబాబు ఇప్పుడు బాకా ఊదుకుంటున్నారా అని అర్థం చేసుకున్నారు.
పరువు
పోతుందని...
కడప స్టీల్ ప్లాంట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ జీఎమ్మార్ కూడా విమానాశ్రయ వేదికపై వైఎస్ జగన్‌ను పొగిడితే, అయన కాలంలోనే పనులన్నీ పూర్తయ్యాయని ప్రధాని సమక్షంలో వేదిక మీద చెబితే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుందేమోఅని భయపడి ఏకంగా జీఎమ్మార్‌ను మాట్లాడకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అంటున్నారు. లేకుంటే సంస్థ ప్రమోటర్ కనీసం రెండు ముక్కలైనా మాట్లాడకుండా ఎలా?.. కేవలం తానుచేయని పనులకు.. తన పాత్ర తక్కువే అయినా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్న చంద్రబాబు తన పరువు పోకుండా ఉండేందుకే జీఎమ్మార్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు.


