● వెల్లువెత్తిన అర్జీలు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డికి విన్నవించుకున్నారు. భూకబ్జాలు, ఉపాధ్యాయుల కొర త, సంక్షేమ పథకాలు అందకపోవడం తదితర స మస్యలతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది.
కాళ్లు చేతులు లేని ఆ దేహాన్ని మోసుకుంటూ ఓ భార్య పడుతున్న ఆరాటం..అన్యాయాన్ని ఎదిరించలేక ఆ దివ్యాంగుడి కళ్లలో ఉబికివస్తున్న ఆవేదన..సోమవారం కలెక్టరేట్‌లో అందరినీ కలిచివేసింది. బలిజిపేట మండలం పెద్దింపేటకు చెందిన వెన్నెల వెంకటరాజు అనే వృద్ధ దివ్యాంగుడికి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 53–7, 53–9 స్థలంలో 2018లో వెన్నెల దామోదర్ అనే వ్యక్తి తాత్కాలికంగా ఇల్లు కట్టుకునేందుకు రేకుల షెడ్డు, పశువుల పాక వేశాడు. ఇప్పుడు ఆ స్థలం ఖాళీ చేయమంటే దిక్కున్న చోట చెప్పుకోమంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఊరి పెద్దలు చెప్పినా పెడచెవిన పెడుతున్నాడు. ‘అయ్యా.. నేను కదలలేని వాడిని. నా చేతకానితనాన్ని ఆసరాగా తీసుకుని నా స్థలాన్ని మింగేయాలని చూస్తున్నాడు.. ఆ కబ్జాకోరు బెదిరింపుల నుంచి కాపాడి నా స్థలం నాకు ఇప్పించండి సారూ‘ అంటూ వెంకటరాజు తన భార్య సాయంతో అధికారుల ముందు కన్నీటిపర్యంతమయ్యాడు.
బడికి వెళ్తున్నామన్న సంబరమే తప్ప..అక్కడ తమకు పాఠాలు చెప్పే పంతుళ్లు ఎవరొస్తారో ఆ పసిబిడ్డలకు తెలియదు. నిన్న వచ్చిన సారు ఇవాళ రాడు. ఇవాళ వచ్చిన సారు రేపు రాడు. ఇది మక్కువ మండలం అలుగరువు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దుస్థితి. 1 నుంచి 4వ తరగతి వరకు 45 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న ఈ బడిలో గత రెండేళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేడు. అంతా డిప్యుటేషన్ల మీదే నెట్టుకొస్తున్నారు. రోజుకో టీచర్ వస్తుండడంతో ఆ పసివాళ్ల చదువులు అగమ్యగోచరంగా మారాయి. నిబంధనల ప్రకారం కనీసం ఇద్దరు రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిన చోట, ఒక్కరూ లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ‘మా పిల్లల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది సారూ.. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకై నా కనీసం ఇద్దరు సీఆర్టీలనైనా నియమించి ఆ గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయండి అంటూ పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకున్నారు.
దళితుల భూములపై పెత్తందారుల కన్ను
మక్కువ మండలం పాపయ్యవలసలో 50 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన డీ–పట్టా భూములను కాజేసేందుకు కొందరు పెత్తందార్లు రెవెన్యూ అధికారుల అండతో యత్నిస్తున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. తక్షణమే ఆ భూములను రీ–సర్వే చేసి దళితుల పేరిట ఆన్‌లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.


