పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ రీ –సర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రీసర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతోపాటు పీజీఆర్‌ఎస్, ఇతర రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని సూచించారు. సరిహద్దు వివాదాలు, రెవెన్యూ రికార్డుల దిద్దుబాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ మాధురి, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పాలకొండ: పాలకొండ గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధారాణిపై పీడీ ధర్మరాజు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. పాలకొండ మండల గృహనిర్మాణ శాఖ పోస్టు నుంచి తప్పించి వీరఘట్టం ఏఈకి ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏఈపై ఇటీవల పాలకొండ పట్టణంలోని సచివాలయ వార్డు ఇంజినీర్లు నగరపంచాయతీ కమిషనర్‌తోపాటు గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేకుండా తమ లాగిన్ నుంచి గృహనిర్మాణ శాఖ లబ్ధిదారులకు సిమెంట్ అందించకుండా అందించినట్లు ఏఈ నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ ఈఈ సోమేశ్వరరావు లబ్ధిదారులను విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.
విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర వేడుకలను దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలు, స్టాళ్లు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉండాలని చెప్పారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరిస్తామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.


