న్యూస్‌రీల్
వీరఘట్టం:
● ఈ ఏడాది ఏప్రిల్ 5న పిడుగుపాటుకు వీర ఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని వస్తున్న పైల అనసూయమ్మ అనే వ్యవసాయ కూలి బలైంది. వంగర మండలం ఎం.సీతారాంపురంలో పిడుగుపాటుకు ఓ ఇంటిలో వారంతా అపస్మారకస్థితికి చేరుకున్నారు.
● ఏప్రిల్ 6న పిడుగుపాటుకు బలిజిపేట మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన మహిళా రైతు డి.సింహాచలం, వంగర గ్రామానికి చెందిన ఇనముల నరసమ్మ, వంతరాం గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళా రైతు మృతి చెందారు. తెర్లాం మండలం విజయరాంపురంలో ఓ ఎద్దు కూడా మృతి చెందింది.
● ఈ నెల 9న కొత్తవలస మండలం చీపురవలసలో పశువుల శాలపై పిడుగుపడడంతో పాడి గేదె చనిపోగా, పశువుల పాక దగ్గమైంది.
● ఈనెల 12ను వీరఘట్టం మండలం నీలంపేట వద్ద పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు చనిపోయాయి.
● ఈనెల 13న రేగిడి మండలం కొండవలసలో క్రికెట్ ఆడుతున్న ఆమిటి పవన్ అనే విద్యార్థి పిడుగుపాటుకు గురై చనిపోయాడు. అదే రోజు బాడంగి మండలం భీమవరం గ్రామంలో పొలానికి వెళుతున్న భవానీ అనే మహిళ పిడుడుపడి అక్కడికక్కడే చనిపోయింది.
● భామిని మండలం సొలికిరి గ్రామ సమీపంలో క్రికెట్ ఆడుకుని ఇంటికి వస్తుండగా పిడుగుపడి రాజశేఖర్ అనే యువకుడు సోమవారం దుర్మరణం చెందాడు. అదే రోజు మొరకముడిదాంలో సాతంవలసలో పూరింటిపై పిడుగుపడి ఇంటిలో ఉన్న గౌరమ్మ అనే మహిళ మృతి చెందింది.
మేఘావృతమై గర్జిస్తే చాలు జనం గుండెల్లో దడ పెరుగుతోంది. ఏ వైపు నుంచి పిడుగు పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇటీవల కాలంలో మనుషులు, పశువులను పిడుగులు తాకుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో 20 మంది పిడుగుపాటుకు మృతిచెందగా, ఈ ఏడాది ఇంత వరకు 8 మంది చనిపోయారు. ఆటలాడుకునే విద్యార్థులు, పొలం పనులు చేసే కర్షకులు, పశువులు, జీవాల పెంపకందారులు అధికమంది పిడుగుపాటుకు గురవుతున్నారు. వాతావరణశాఖ పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని ముందస్తుగానే తెలియజేస్తున్నా.. నిరక్షరాస్యులైన కర్షకులు, పశువుల కాపర్లకు చేరక మృత్యు ఒడికి చేరుకుంటున్నారు.
పిడుగు పాటు నుంచి తప్పించుకొనేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి నేరుగా భూమిలో నేరుగా లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పిడుగులో ఉన్న విద్యుదావేశాన్ని భూమి తనలోకి ఆక్షరించుకుంటుంది. ఎత్తైన టవర్లు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల పిడుగుపాటు నుంచి తప్పించుకుంటాం. – డాక్టర్ బి.కూర్మనాథ్,
రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టాలి. తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలోఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందజేయాలి. – డాక్టర్ జె.రవీంద్రకుమార్,
వైద్యులు, జిల్లా సర్వజన ఆస్పత్రి, పార్వతీపురం
మెరుపు నుంచి ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. ఒక్కోసారి విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2 లక్షల ఓల్టులతో సమానం. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. పిడుగులు ఎక్కువగా క్యుములో నింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. మేఘాల్లో మంచు, నీరు ఏర్పడినప్పుడు స్ట్రాటోస్పియర్‌లో చల్లని వాతావరణంలో విరుద్ధ విద్యుదావేశాలు ఏర్పడి స్ధిర విద్యుత్ ప్రవాహంగా మారతాయి. ఆ సమయంలో పిడుగులు ఏర్పడతాయి.
– డాక్టర్ బి.ప్రదీప్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం
ప్రాణాలు తీస్తున్న పిడుగులు
‘మెరుపు’ వేగంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు
కర్షకులు, విద్యార్థులకు చేరని పిడుగుల సమాచారం
గతేడాది పిడుగుపాటుకు ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 20 మంది మృత్యువాత
ఈ ఏడాది ఇంత వరకు 8 మంది మృతి


