చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు

నిబంధనల ప్రకారం ముందుకెళ్లండి..

జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

సాక్షి, పార్వతీపురం మన్యం: చెరువుల ఆక్రమణల విషయంలో తరతమ భేదాలు వద్దని.. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన శాఖలతో పాటు నీటిపారుదల తదితర శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను, ప్రగతిని మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా చెరువుల ఆక్రమణపై దృష్టి సారించాలని హితవు పలికారు. కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి తొలుత మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, పార్వతీపురం ఎమ్మెల్యే కూడా ఇదే విషయం చెప్పారని తెలిపారు. జలధార–జల హారతి కార్యక్రమంలో భాగంగా.. చెరువుల హద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగిస్తామని కలెక్టర్‌ తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర మాట్లాడుతూ.. నియోజక వర్గ కేంద్రంలో దేవుని బంద, బిళ్ల బంద చెరువుల ఆక్రమణల విషయంలో అధికారులు నోటీసులిచ్చి సరిపెట్టారని, తదుపరి చర్యలు తీసుకోలేదని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. పట్టణంలో పలుచోట్ల కాలువలు, చెరువుల మీద అక్రమ కట్టడాలు ఉన్నాయని.. న్యాయంగా ముందుకు వెళ్లాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.

ఇసుక తరలింపును అడ్డుకోవద్దు : ఎమ్మెల్యే

ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారని.. పార్వతీపురంలోనే ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర లేవనెత్తారు. సీతానగరం మండలంలోని సువర్ణముఖి నది నుంచి ఇసుకను తరలిస్తే అధికారులు ట్రాక్టర్లను పట్టుకొని వారంరోజులపాటు ఉంచేస్తున్నారని.. ఇది సమంజసం కాదని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం వెళ్లాలని, అడ్డగోలుగా వ్యాపారం కోసం తరలిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు టెండర్లు ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర ప్రశ్నించారు. దీనిపై మంత్రి జోక్యం చేసుకుంటూ.. ఘటనపై ఆరా తీశారు. శాఖలోని ఉద్యోగులకే టెండర్లు ఇస్తే ఈ విధంగానే మాట పడాల్సి వస్తుందని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పైనాపిల్‌, అరటి ఎగుమతులకు చర్యలు

సీతంపేట గిరిజన ప్రాంతంలో పైనాపిల్‌ (అనాస) సాగు సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని, దానిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పైనాపిల్‌, అరటి ఎగుమతులకు చర్యలు తీసుకోవాలన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం శరవేగంగా సాగాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement