● పార్వతీపురంలో ఏం జరుగుతోంది?
● ప్రజా సమస్యలు పక్కన.. భూములపై రాజకీయం
● ప్రశ్నిస్తున్న నియోజకవర్గ ప్రజలు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా.. వాటిపై ప్రజా ప్రతినిధుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యలు, అస్తవ్యస్త రహదారులు, పారిశుద్ధ్య లోపాలు, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి అంశాల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిని పక్కనపెట్టి.. ప్రైవేటు స్థలాల రిజిస్ట్రేషన్ల అంశంపై రాజకీయ దుమారం రేపడం ఎంతవరకు సమంజసమనే చర్చ ప్రజల్లో సాగుతోంది.
ప్రజల అవసరాలపై ఎందుకు మౌనం?
గత 2024 ఎన్నికల సమయంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయచంద్ర.. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్వతీపురం మున్సిపల్ పాలక వర్గాన్ని రాజకీయ కక్షతో డమ్మీగా చేసి.. పట్టణంలో అభివృద్ధి పనులకు విఘాతం కలిగించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కొరతపై ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు.
అభివృద్ధి కంటే వివాదాలకే ప్రాధాన్యమా?
నియోజకవర్గంలో నిరుద్యోగం, తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్య సమస్యలు, ప్రభుత్వ సేవలలో జాప్యం వంటి అనేక అంశాలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిపై చర్చ జరగాల్సిన సమయంలో ప్రైవేట్ భూముల వ్యవహారాలే ప్రధాన రాజకీయ అజెండాగా మారడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
● నియోజకవర్గంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. బలిజిపేట, సీతానగరం మండలాల్లోని నదుల నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు నష్టం కలిగించేదే. దీనిపై ఏనాడూ ఎమ్మెల్యే నోరు మెదపలేదు.
● పార్వతీపురం పట్టణ నడిబొడ్డున మున్సిపల్ స్థలం మూడెకరాలు కబ్జాకు గురైంది. దీనిపై అధికార పార్టీ నేత హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువ చేసే వరహాలగెడ్డపై గెద్దలు వాలాయి. వీటిపై అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా, నెల్లి చెరువును కప్పేస్తున్నా.. పెద్ద మనసుతో స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నించిన దాఖలాలు లేవు.
● శివారు కాలనీలు, పట్టణంలోని పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలనీల్లోని వీధుల్లో వర్షపు నీరు నిల్వ ఉండిపోతోంది. మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో దుర్ఘంధంతోపాటు, దోమల బెడద వేధిస్తోంది. దీని గురించి అధికార పార్టీ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు.
● వారానికి ఒకరోజు మున్సిపల్ కుళాయిల్లో తాగునీరు వస్తోంది. అది కూడా బురదనీరే దిక్కవుతోంది. గత పాలకవర్గ సమయంలోనే తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2.41 కోట్లు మంజూరయ్యాయి. ప్రతిపాదిత పనులు చేయడానికి కౌన్సిల్ కూడా తీర్మానం తెలిపింది. రాజకీయ గ్రహణంతో గత పాలకవర్గం ఆమోదం తెలిపిన పనులకు అడ్డుకట్ట వేశారు. దీంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ప్రజల గొంతు తడిపేందుకు ఎమ్మెల్యే గానీ, ఇతర టీడీపీ నాయకులు గానీ ప్రయత్నించిన పరిస్థితులు కానరావడం లేదు.
● ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రధాన బాధ్యత ప్రజాసమస్యలకు పరిష్కారం చూపడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం. ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సహజమే. నియోజకవర్గంలో అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలను పక్కనపెట్టి.. కేవలం స్థల వివాదాలనే ప్రధాన రాజకీయ అంశంగా మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న పార్వతీపురం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది.
ప్రైవేట్ లావాదేవీలపై రాజకీయ రగడ
ఇటీవల ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలాల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాద్ధాంతం చేయడం చర్చనీయాంశంగా మారింది. అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యే విజయచంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర సమస్యలను వదిలి.. భూముల చుట్టూనే తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోకస్ ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా, టీడీపీ జిల్లా కార్యాలయం స్థలంపై రగడ, అడ్డాపుశీల ఆక్రమణలంటూ వివాదం, వెంకంపేటలోని స్థలం రిజిస్ట్రేషన్.. ఇలా అన్ని విషయాల్లోనూ అధికార పార్టీకి ఎమ్మెల్యే వెనుకున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గ కేంద్రంతోపాటు.. సీతానగరం వంటి ప్రాంతాల్లో టీడీపీ వారికి కప్పం కట్టలేదని రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిచిపోతున్న ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా ఓ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మెల్యే రూ.లక్షల్లో లంచం అడిగారని ఓ మహిళ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
చట్టబద్ధంగా జరిగే ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు సంబంధిత శాఖల పరిధిలోని అంశాలని, వాటిలో ఏదైనా అక్రమం జరిగితే దానిని చట్టపరంగా ప్రశ్నించాల్సిందే తప్ప రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పలువురు పేర్కొంటున్నారు.


