తిలా పాపం.. తలా స్థలం! | - | Sakshi
Sakshi News home page

తిలా పాపం.. తలా స్థలం!

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

తిలా పాపం.. తలా స్థలం!

● పార్వతీపురానికి చెందిన యడ్ల నరేష్‌ కుమార్‌ సీతానగరం మండలం పెదభోగిలి సర్వే నంబర్‌ 258/2, 5, 8లో ఎకరా 11 సెంట్లు 2021లో కొనుగోలు చేశాడు. తన స్నేహితులు కొనుగోలు చేసిన కొంత స్థలంతో కలిపి అక్కడ ఏడు ఎకరాల వరకూ వీరి ఆధీనంలో ఉంది. ఆ స్థలం 1బీ కోసం, మ్యుటేషన్‌ చేయాలని రెవెన్యూ అధికారులను పలుమార్లు కలిశాడు. వారు ఏదో కొర్రీ పెడుతూనే ఉన్నారు. ఆ స్థలం రైలు రోడ్డులో ఉందని కొన్నాళ్లు పేచీ పెట్టారు. అందుకు సంబంధించిన రికార్డులన్నీ ఆయన సేకరించాడు. అది పూర్తిగా జిరాయితీ అని.. రైలు రోడ్డులో కేవలం 25 సెంట్లు మాత్రమే ఉందని.. అది కూడా తన స్థలానికి వచ్చిన నష్టం ఏమీ లేదని పక్కా ఆధారాలు సేకరించి చూపాడు. కొద్ది రోజుల కిందట.. టీడీపీ నాయకులను కలవాలని తహసీల్దార్‌ ఆయనకు సూచించినట్లు తెలిసింది. ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయంలోనే.. టీడీపీకి చెందిన ఇసుక మాఫియాలో కీలకంగా వ్యవహరించే ఓ వ్యక్తిని కలిశాడు. కొంత మొత్తం ‘కప్పం’ కట్టేస్తే పని అయిపోతుందని ఆ వ్యక్తి స్థల యజమానికి సలహా ఇచ్చాడు. ఎకరాకు రూ.లక్ష వరకూ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అన్ని ఆధారాలూ ఉన్నప్పటికీ తాను అంత డబ్బులు ఎందుకు కట్టాలని అధికారుల చుట్టూ స్థల యజమాని తిరుగుతూనే ఉన్నాడు.

===========

● కొద్ది రోజుల కిందట సాలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 175/1లో రూ.కోట్ల విలువైన 3.14 ఎకరాల భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం విదితమే. ఇందులో కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంతో పాటు.. రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పాత్రపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డలు, పోరంబోకు స్థలాలు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులు ఏదైనా స్థలం కొనుగోలు చేసినా.. స్థానికంగా నివాసం లేకున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గెద్దల్లా వాలిపోతున్నారు. నయానో, భయానో ‘కప్పం’ వసూలు చేస్తున్నారు. రూ.లక్షల్లో అనధికార పన్ను వేస్తున్నారు. డబ్బులు ఇచ్చే వరకూ వేధిస్తున్నారు. అంతా సవ్యంగా ఉన్నా సరే.. రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్లు కాకుండా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయకుండా అడ్డు పడుతున్నారు. కొందరు అధికారులు కూడా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికార పార్టీకి చెందిన వారికి కుర్చీలు వేసి మరీ రాజీలు కుదుర్చుతుండడంపై సభ్యసమాజం ఆందోళన చెందుతోంది.

కొన్నింటిపై మౌనం.. కొన్నింటికి రాద్ధాంతం

జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ వంటి పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణ చెరలో ఉన్నాయి. చెరువులు, గెడ్డలు ఆక్రమణదారుల చేతిలో పడి చిక్కిపోతున్నాయి. వీటికి ప్రజా ప్రతినిధులు, డాక్యుమెంటు రైటర్ల డైరెక్షన్‌లో ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. తమకు ‘అనుకూలంగా’ ఉన్న స్థలాల విషయంలో మౌనం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలు.. కొన్ని చోట్ల రాద్ధాంతం చేస్తున్నారు. పార్వతీపురం పట్టణ పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు రాజకీయ నాయకుల అండతో ఆక్రమించుకుంటున్నారు. వివాదాస్పద వెంకంపేట గెడ్డ పోరంబోకు స్థలంతో పాటు పట్టణంలోని వరహాలగడ్డ, నెల్లిచెరువు, బిళ్ల బంద, దేవుని బంద, మున్సిపల్‌ మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. మున్సిపల్‌ స్థలం పట్టణ నడిబొడ్డులో మూడు ఎకరాల స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తి కాజేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డాపుశీల పరిధిలోని ఓ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. జిల్లాలోని భూములు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్న సామాన్యులు భయాందోళన చెందుతున్నారు. ఏది కొంటే.. ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందో అని భయపడుతున్నారు. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు.. ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు ఈ వ్యవహారంలో ఒకే మాట మీద వెళ్తూ, సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నారు.

దొందూ దొందే.. అక్రమార్కులకు విందే..

జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు

ప్రజా ప్రతినిధులకు కప్పం కట్టకుంటే చిందులే

సహకారం అందిస్తున్న అధికార యంత్రాంగం

పార్వతీపురం మండలం వెంకంపేట రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 121–1లోని 0.13 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్‌పై ఇటీవల స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్‌చంద్ర తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. అది ఇరిగేషన్‌ స్థలం అని ఆయన వాదన. గతంలోనూ ఈ స్థలంలో కట్టిన నిర్మాణాలను తొలగించారు. ఆ తర్వాత రూ.లక్షల్లో టీడీపీ నాయకులకు బాధితులు ‘కప్పం’ కట్టారు. ఆ మొత్తం కూడా చాలకపోవడంతో మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారని వారి ఆరోపణ. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ విషయంలో జరిగిన ఇబ్బందులపై స్థల యజమాని గ్రంధి నిర్మల.. జిల్లా కలెక్టర్‌, ఐజీ (రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ), ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని రిజిస్ట్రార్‌, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

పార్వతీపురం మండలంలోని ఎంఆర్‌ నగరం గ్రామానికి చెందిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు 2025లో అప్పటి తహసీల్దారు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. గ్రామంలో సర్వే నెంబర్‌ 386/1లో వీరికి పట్టాలు మంజూరయ్యాయి. ఇద్దరికీ ఇది వరకే నివాస స్థలాలు, ఇళ్లు కూడా ఉన్నాయి. అది కూడా ఆర్యవైశ్యులకు చెందిన ప్రైవేట్‌ స్థలంలో ఆక్రమణలు చేసి, పట్టాలు ఇవ్వడం వివాదం అయ్యింది. దీనిపై బాధితులు ఇటీవల పీజీఆర్‌ఎస్‌ లో ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement