విద్యాశాఖలో రింగ్‌ మా‘స్టార్‌’ | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో రింగ్‌ మా‘స్టార్‌’

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

మాస్టారి చరిత్రంతా అవినీతిమయం

మాస్టారి చరిత్రంతా అవినీతిమయం

సాక్షి, పార్వతీపురం మన్యం: ఒక సాధారణ మాస్టారి హవా.. విద్యాశాఖ, సమగ్రశిక్ష మొత్తం వ్యాపించింది. అక్కడితో ఆగిపోతే ఆ శాఖకే పరిమితమయ్యేదేమో! కలెక్టరేట్‌ విభాగాల్లో సైతం ఆయనే చక్రం తిప్పుతున్నారు. విద్యాశాఖలో షాడో డీఈవోగా వ్యవహరిస్తున్న ఆ మాస్టారి అవినీతిపై బాధితులు గగ్గోలు పెట్టినా, ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఆయన కన్నెర్ర చేయడంతో అక్రమంగా బదిలీ అయిపోయి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా ఎవరు వచ్చినా.. ఆయన ‘కిందే’ పని చేయాల్సి వస్తోంది. పేరుకు వారు డీఈవో, సమగ్రశిక్ష ఏపీసీ గానీ.. పెత్తనమంతా ఆ మాస్టారిదే! చివరకు ఆ ‘శంకరుడు’ ఏ మాయ చేస్తారో గానీ.. జిల్లాకు కలెక్టర్లుగా వచ్చిన వారు సైతం ఈయన చెప్పిన మాట వినాల్సిందే. గత కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ నుంచి ప్రస్తుత కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి వరకూ ఇందుకు మినహాయింపు లేదన్నవాదన వినిపిస్తోంది.

కాంట్రాక్టులు ఆయన కుటుంబ సంస్థవే..

జిల్లా యంత్రాంగం పరంగా ఏ కాంట్రాక్టు పనులు చేయాలన్నా సదరు మాస్టారు భార్య పేరిట ఉన్న సంస్థకే బాధ్యతలు అప్పగిస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, ఆయన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టర్లు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమైనా.. అధికారులు ఈ విషయంలో ప్రత్యేక సడలింపు ఇస్తున్నారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలల్లో విద్యార్థులకు యోగాభ్యాసం చేయించేందుకు అవసరమైన మ్యాట్‌, చొక్కా(షర్టు) సరఫరా చేసేబాధ్యతను ఏకపక్షంగా ఈ మాస్టారి భార్య సంస్థకు అప్పగించారు. ఇందుకోసం రూ.19.55 లక్షల నిధులు మంజూరు చేశారు. కనీసం టెండర్లు ఆహ్వానించకుండానే.. కొటేషన్లతో మమ అనిపించేసి ఆ మాస్టారి మాట ప్రకారం బాధ్యతలు అప్పగించి తమ ప్రేమను చాటుకున్నారు. ఆ సామగ్రి రాకుండానే బిల్లులు కూడా చెల్లించడం గమనార్హం.

– అక్కడే కాదు, కలెక్టరేట్‌లో చీపురు కదలాలన్నా.. షెడ్డు వేయాలన్నా, భవనం కట్టాలన్నా.. కథలు, కార్యాలు జరగాలన్నా.. ఆ మాస్టారి సంస్థకే బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా ఒక ఉద్యోగి భార్యకు చెందిన సంస్థకు రూ.కోట్ల విలువ చేసే పనులు ఎలా అప్పగిస్తారన్నది ఉద్యోగవర్గాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

డిప్యుటేషన్‌పై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సదరు ఉపాధ్యాయునిపై ఆది నుంచి తీవ్ర ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా విద్యాశాఖ నిర్వహించే అనేక కార్యక్రమాలతోపాటు, పదో తరగతి పరీక్షల సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు విమర్శలున్నాయి. ఉపా ధ్యాయుల బదిలీల్లోనూ ఈయన పాత్ర కీలకం. తనకు అనుకూలంగా ఉంటే మంచి స్థానాలు కేటాయించడం.. లేకుంటే చింతపల్లికి బదిలీ చేయించడం పరిపాటిగా మారింది. గతంలో పార్వతీపురం ఐటీడీఏలో డిప్యుటేషన్‌పై పని చేసిన సమయంలోనూ ఆయన సస్పెండ్‌ అయ్యారు. ఆ వివరాలు నేటికీ ఎస్‌ఆర్‌లో చేర్చలేదు. డిప్యుటేషన్‌ సమయంలో ‘రిలీవింగ్‌, ‘జాయినింగ్‌‘ వంటి ప్రక్రియ, లిఖిత పూర్వక ఉత్తర్వులు వ్యవహారంలోనూ ఆయన మీద పలు ఆరోపణలున్నాయి. ఈ మాస్టారి అవినీతి, అక్రమాలపై గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ గతంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణ చేపట్టాలని డీఈవోకు పై నుంచి ఆదేశాలొచ్చాయి. వ్యవస్థలను మేనేజ్‌ చేసే సత్తా ఉన్న ఆ మాస్టారు.. విచారణను సైతం తుంగలో తొక్కించేశారు. జిల్లా విద్యాశాఖకు ఏ డీఈవో వచ్చినా డమ్మీలుగానే మిగిలిపోతున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నచ్చకపోతే డీఈవో లను సైతం మార్చగల సామర్థ్యం ఆయనకు ఉందని చెబుతున్నారు.

పెత్తనం నుంచి కాంట్రాక్టుల వరకు

అన్నింటా ‘శంకరుని’ లీలలే..

విద్యాశాఖలో కొనసాగుతున్న మాస్టారి హవా

కలెక్టరేట్‌లోనూ పెత్తనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement