నాణ్యతకు పాతరేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

నాణ్యతకు పాతరేద్దాం..

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

మారుమూల ప్రాంతం.. నాణ్యతకు పాతరేద్దాం.. పర్యవేక్షిస్తాం..

మారుమూల ప్రాంతం..

సీతంపేట: ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి.. అధికార బలం వెరసి గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. నచ్చినట్టు రోడ్లు వేస్తున్నారు. నిర్మించిన వెంటనే రోడ్లు పాడవుతున్నా కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ నెల 30వ తేదీలోగా ఉపాధిహామీ నిధులతో చేపట్టే పనులు పూర్తిచేస్తే బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుంది. వచ్చేనెల నుంచి ఉపాధిహామీ పేరు వీబీజీరామ్‌జీగా మారనుంది. ఈ నేపథ్యంలో పనులు ఆదరబాదరగా పూర్తిచేసే పనిలో పలువురు కాంట్రాక్టర్లు ఉండడం గమనార్హం. మారుమూల కొండ శిఖర గ్రామాల్లోని పనులను ఎవరూ పర్యవేక్షించరన్న ఉద్దేశంతో కనీస నిబంధనలు పాటించడం లేదు. దీనికి జగతపల్లి రోడ్డు నిర్మాణమే నిలువెత్తు సాక్ష్యం. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో రూ.80 లక్షల అంచనా వ్యయంతో జగతపల్లి గ్రామానికి 1.2 కిలో మీటర్ల సీసీ రోడ్డు మంజూరైంది. కొద్ది రోజులుగా చేపడుతున్న పనుల్లో నాణ్యతకు పాతరేస్తున్నారు. రోడ్డు లెవెలింగ్‌ లేదు. రోలింగ్‌ చేయడంలేదు. జీఎస్‌బీ(గ్యాన్యులర్‌ సబ్‌ బేస్‌) నాలుగు ఇంచీలు వేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. వాటరింగ్‌ చేసిన దాఖలా లేవు. ఏఈ పర్యవేక్షణ లేకుండానే సిమెంట్‌, చిప్స్‌, ఇసుక మిక్స్‌ర్‌ ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. పెద్ద వాహనాలు ఈ రోడ్డుగుండా వెళ్తే రోడ్డు వెంటనే మూడుముక్కలవుతుందని స్థానికులు చెబుతున్నారు. శాశ్వత నిర్మాణాలను నాసిరకంగా చేపట్టడంపై ఆందోళన చెందుతున్నారు. పనుల్లో నాణ్యత లోపించడంతో ఎన్నిరోజులు ఉంటుందో, ఊడుతుందోనని గిరిజనులు వాపోతున్నారు.

నెలరోజుల కిందట ఉప్పరజమ్మి–రేగుమానుగూడ వరకు రూ.50 లక్షలతో చేపట్టిన రోడ్డు పనుల్లోనూ నాణ్యత పాటించడం లేదని హడ్డుబంగి మాజీ సర్పంచ్‌ సూర్యారావుతో పాటు పలువురు గిరిజనులు స్వయంగా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అది మరిచిపోకముందే దేవనాపురం పంచాయతీ పరిధిలో జగతపల్లి రహదారి కూడా నాణ్యతడొల్ల కనిపిస్తుండడం ఇంజినీరింగ్‌ అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.

కొండపైకి రోలర్‌ వెళ్లకపోవడంతో రోలింగ్‌ చేయలేదు. నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయో? లేదా? అనేది పర్యవేక్షిస్తాం.

– నాగభూషణరావు, డీఈ,

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ విభాగం

నాసిరకంగా జగతపల్లి సీసీ రోడ్డు నిర్మాణం

రోలింగ్‌ లేదు.. వాటరింగ్‌ అంతంతమాత్రమే..

నిధులు కాజేతే లక్ష్యంగా ఆదరబాదరగా పనులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement