● పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి ● వ్యవసాయ కూలీల ఇళ్లలో విషాదం
బలిజిపేట: వారు నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబాలకు చెందిన మహిళలు. ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు సాగుచేస్తూ, మరోవైపు వ్యవసాయ కూలిపనులు చేస్తూ భర్తకు తోడుగా, కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు. వారిపై మృత్యువు పగబట్టింది. సొంత భూమిలో సాగుచేసిన మొక్కజొన్న కండెలను విరుస్తుండగా సోమవారం సాయంత్రం పిడుగు రూపంలో కబళించింది. వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మృతిచెందిన ఇద్దరు మహిళలకు భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక్కో కుమారుడు ఉన్నారు.
శ్రీరంగరాజపురంలో పిడుగుపాటుకు మృతిచెందిన డి.సింహాచలం (38) భర్త శివుడు ఇద్దరూ వ్యవసాయ కూలీలే. వీరి పెద్దకుమార్తె స్వాతి ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె రాజేశ్వరి వంతరాం కేజీబీవీలో 8వ తరగతి, కుమారుడు సాయికుమార్ బొబ్బిలిలో ఒక ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తల్లి మృతితో కన్నీరు పెట్టారు.
● వంతరాంలో పిడుగుపాటుకు మృతిచెందిన పార్వతి(40( భర్త వేణు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, మరోవైపు దర్జీ పని చేస్తుంటాడు. వీరి పెద్దపిల్ల సంధ్య పైడిభీమవరంలో ఒక ల్యాబ్‌లో పనిచేస్తోంది. రెండో కుమార్తె పోటీపరీక్షలకు విజవాడలో శిక్షణ పొందుతోంది. కుమారుడు రాజ మౌళి తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వీరికి 50 సెంట్లలోపు సొంతభూమి ఉంది. మొక్కజొన్న కండెలను విరుస్తున్న పార్వతిపై పిడుగుపడి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం అలుముకుంది.
మృతురాలు సింహాచలం, పార్వతి


