విజయనగరం లీగల్: విజయనగరం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా నళితం రమేష్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్‌లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఉపాధ్యక్షులుగా పి. బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శిగా గడి మురళి, సంయుక్త కార్యదర్శిగా పి. వరలక్ష్మి, కోశాధికారిగా పి. రామచంద్రరావు, స్పోర్ట్స్ కార్యదర్శిగా జేవీఎస్‌ఎన్ మూర్తి, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చంద్రశేఖర్, వి. రత్నకుమారి, ఎస్. రమేష్, బి.పార్వతి, వి. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.
డివిజన్లు పెరిగాయ్..
విజయనగరం: నగర పరిధిలో ఉన్న 50 డివిజన్ల సంఖ్యను 62కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ బాలస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల పెంపు నేపథ్యంలో అవసరమైన కసరత్తును తక్షణమే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
బొండపల్లి: ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నలపై దాడి చేసిన తమ్ముడు, అతని భార్యను బుధ వారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళి తే.. మండలంలోని కొండకిండాంలో గత నెల 30న జరిగిన ఆస్తి తగాదాలో కలిశెట్టి గౌరునాయుడు తన ఇద్దరు అన్నలైన సత్యనారాయణ, బంగారునాయుడుపై కత్తితో దాడి చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరునాయుడు, అతనికి సహకరించిన భార్య జయశ్రీలను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
నెలివాడలో దొంగతనం
బొండపల్లి: మండలంలోని నెలివాడలో ఓ ఇంటిలో బుధవారం వేకువజామున దొంగతనం జరిగింది. ఎస్సై యు.మహేష్ తెలియజేసిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన షేక్ రసూల్ దొంగలు ప్రవేశించి, పావు తక్కువ రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్‌ట్యాప్‌ను అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని వయసు సుమారు 50 ఏళ్లు ఉంటాయని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. నలుపు రంగు ఫ్యాంట్, బిస్కెట్ కలర్ షర్ట్‌తో ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
వ్యర్థాల నుంచి సంపద
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్డ్స్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టి అనే అంశంపై బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భూమిలో కరగని ప్లాస్టిక్ వస్తువులు, సంచులు వంటి వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి ఉపయోగించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏదీ వ్యర్థం కాదని.. సరైన విధంగా వినియోగిస్తే వాటి నుంచి ఉపయోగపడే వస్తువులు తయారు చేయవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా వ్యర్థాలతో విద్యార్థులు వివిధ రకాల వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు.
అమరావతిపై అనిశ్చితి తొలిగింది
విజయనగరం అర్బన్: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు ఆమోదం లభించడం ఆనందంగా ఉందని.. ఇకపై రాజధానిపై ఉన్న అనిశ్చితి తొలిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి అమరావతి అభివృద్దికి సహకరించాలని పిలుపునిచ్చారు.


