● బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆస్పత్రులు
● ఫలితంగా రోగులకు అందని వైద్య సేవలు
● జిల్లాలో 28 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు
● ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.40 కోట్లు
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలోని ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్య సేవ) నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ ఽపథకం ద్వారా రోగులకు చికిత్స అందించిన ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా అలసత్వం వహించడం వల్ల ఈ సేవలు నిలిచిపోయాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ల కాలంలో మూడుసార్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె చేపట్టాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గతంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య ధోరణి అవలింబించేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం ఆరోగ్యశ్రీ రోగుల పాలిట శాపంగా మారిందనే విమర్శలున్నాయి. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.
● గొప్పలు కుప్ప చంద్రబాబు
అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ప్రజలకు పునర్జన్మ ప్రసాదించే ఆరోగ్యశ్రీ పథకం పట్ల టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● బకాయిలు సుమారు రూ.40 కోట్లు
జిల్లాలో 28 ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటికి సుమారు రూ.40 కోట్లు వరకు చంద్రబాబు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు పెరిగిపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె చేపట్టాయి. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందే ఆరోగ్యశ్రీ పథకం పట్ల చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
● జిల్లాలో ప్రైవేటు ఆరోగ్యశ్రీ
నెట్‌వర్క్ ఆస్పత్రులు
సాయి పీవీఆర్ ఆస్పత్రి, వెంకటరామ, శ్రీసాయి సూపర్ స్పెషాలటీ, మువ్వ గోపాల ఆస్పత్రి, వెంకట పద్మ, గాయిత్రి, కాశ్వి, కొలపర్తి ఆస్పత్రి, మారుతి ఆస్పత్రి, అభినవ్, స్వామి కంటి ఆస్పత్రి, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, బాబూజీ తదితర ఆస్పత్రులు ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు తమకు చెల్లించాల్సిన బకాయిల కోసం వారం రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాయి. అయినప్పటకీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో సేవలను నిలిపివేశారు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు సమ్మె చేపట్టాయి. తాజాగా మూడోసారి కూడా సమ్మె చేపట్టారు. రెండోసారి సమ్మె చేపట్టినప్పడు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు ధర్నా చేపట్టారు. ఆరోగ్యశ్రీ పేదల కల్పతరువుగా ఉండేది. పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరి ఉచితంగా సేవలు అందించేవారు. గుండె జబ్బులు, కేన్సర్ వంటి పెద్ద వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించేవారు.


