పల్లెల్లోనూ..ప్రత్యేకమే.. | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లోనూ..ప్రత్యేకమే..

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

పల్లెల్లోనూ..ప్రత్యేకమే.. రేపటి నుంచి అమల్లోకి.. ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? నిధులు లేక నీరసం.. చెక్‌ పవర్‌ ప్రత్యేకాధికారులకే..

ప్రత్యేకాధికారుల చేతికి పంచాయతీల ‘పవర్‌‘

నేటితో ముగియనున్న సర్పంచుల

పదవీ కాలం

సాక్షి, పార్వతీపురం మన్యం:

పంచాయతీల పాలక వర్గం గడువు గురువా రంతో ముగుస్తోంది. రేపటి నుంచి పల్లెలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్‌ పాలక వర్గాల గడువు ముగియడంతో పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ నెల రెండో తేదీతో సర్పంచుల పదవీ కాలం కూడా ముగియనుంది. చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

జిల్లాలో 15 మండలాలకు సంబంధించి 451 గ్రామ పంచాయతీలున్నాయి. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రత్యేకాధికారులుగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఈఓలు, అంతే సమాన, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన వారిని ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జాబితాకు కలెక్టర్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు అధికారుల పాలన సాగనుంది. 2021 ఫిబ్రవరిలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అదే ఏడాది ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం నగర పాలక సంస్థ, పురపాలక సంఘాలు, పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనపైన ఆధారపడి ఉన్నాయి. మున్సిపల్‌ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేనట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. అదే బాటలో పంచాయతీలు కూడా వెళ్లనున్నాయి. డీపీఓ కార్యాలయం ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు జాబితా ప్రచురణను ప్రభుత్వం వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకనే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో మరో 17 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. వాటికీ అనుమతులు రావాల్సి ఉంది.

ఇప్పటికే నిధులు లేక పంచాయతీలు అభివృద్ధికి దూరమయ్యాయి. కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లోకి జమవ్వదు. 2024–25కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు గత డిసెంబర్‌లో వచ్చాయి. వీటితో టైడ్‌, అన్‌ టైడ్‌ పనులు చేయాల్సి ఉంటుంది. మంచినీరు, పారిశుధ్యం, హరిత రాయబారులకు గౌరవ వేతనం, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, అభివృద్ధి పనులు ఈ నిధులపైనే ఆధారపడి ఉంటాయి. జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధులే ఇంకా రూ.30 కోట్ల వరకూ రావాల్సి ఉంది. ఇంటి పన్నుల వసూళ్ల డిమాండ్‌ రూ.6.18 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.5.36 కోట్లు వసూలు అయ్యింది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెస్‌ మొత్తం రూ.లక్షల్లో పెండింగు ఉంది. ఈ నిధులన్నీ పూర్తి స్థాయిలో సమకూరితేనే పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీరు, స్టేషనరీ, ఇతర అభివృద్ధి, నిర్వహణ ఖర్చులకు వినియోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

సర్పంచ్‌ల నుంచి చెక్‌ పవర్‌ ప్రత్యేకాధికారులకే వెళ్లనుంది. ఇక ఏ పనులు చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. సర్పంచ్‌లు నిత్యం గ్రామాల్లో, ప్రజల మధ్య ఉంటారు. ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండటం అరుదు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్‌లపై కక్ష గట్టింది. అభివృద్ధి పనులకు మోకాలడ్డింది. చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఆపేశారు. గ్రామాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement