పాచిపెంట : రీసర్వేలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూ హద్దులు నిర్ణయించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అట వీ, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కొండమోసూరు, మిలియా కంచూరు ప్రాంతాల్లో మాన్సస్ ట్రస్ట్ భూములకు సంబంధించి భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో వున్నాయి, ఎవరు సాగు చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయించాలన్నా రు. సమస్యలు తలెత్తకుండా పక్కాగా రీ సర్వే చేపట్టాలన్నారు. అనంతరం పాంచాలి జిల్లా పరిషత్ పాఠశాలను, గురువు నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. రోగులకు అందుతు న్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట డీఆర్‌ఓ వైశాలి, డీఎఫ్‌ఓ ప్రసూన, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
డెంకాడ: నీట్, ఈఏపీసెట్‌లలో ఉత్తమ ఫలితా ల సాధన కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మంది విద్యార్థినిలను ఎంపిక చేసి నీట్, ఈఏపీసెట్ ఉత్తమ ఫలితాల కోసం అక్కివరం పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌లో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డీఈఓ మాణిక్యంనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తరగతుల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే, పీజీటీలచే తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వసతి, భోజన సదుపాయం కూడా ఇక్కడే కల్పించామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది చాలా విలువైన సమయమని, దీనిని విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉన్నత స్థానాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కంది చంద్రశేఖరరావు, సర్పంచ్ కంది కిరణ్‌కుమార్, ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు వనంగుడి నుంచి చదురుగుడికి చేరుకునే బృహత్తర ఘట్టమైన దేవర మహోత్సవం ఈ నెల 27న సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీషా పేర్కొన్నారు. స్థానిక కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. పసిడికాంతుల పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవానికి సంబంధించి 27న సోమవారం సాయంత్రం వనంగుడి వద్ద అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించి వనంగుడి నుంచి భారీ ఊరేగింపు, మేళతాళాలు, భాజా భజంత్రీలతో అమ్మవారిని గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తీసుకువెళ్తామన్నారు. అదేరోజు రాత్రి 10 గంటలకు హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురు వద్ద ప్రత్యేక పూజలు అనంతరం మరుసటి రోజు మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయానికి అమ్మవారిని తీసుకువస్తామన్నారు. నాటి నుంచి ఉయ్యాల కంబాల మహోత్సవం వరకూ అమ్మవారు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు.


