ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి
● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రాజెక్టుల భూసేకరణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరామ తీర్థసాగర్, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర కీలం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని, ప్రతి ప్రాజెక్టుకు భూసేకరణ దశలను పూర్తి చేయడానికి నిర్ణీత గడువు విధించారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుల రహదారి, ఎస్టీపీల నిర్మాణం, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, మామహామాయ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ అన్ని పనులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ ఈ.మురళి, ఆర్‌డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఎస్‌డీసీలు కళావతి, ప్రమీలాగాంధీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్‌తో పాటు ఇరిగేషన్, జాతీయ రహదారులు, రైల్వే ఖాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిల్ కమిషనర్లు, ఎల్‌ఏ యూనిట్ల డీటీలు పాల్గొన్నారు.


