తూనికల్లో వర్తకుల మోసం
● జీసీసీ మేనేజర్ రాములు
సాలూరు రూరల్: గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలులో వర్తకులు తూనికల్లో మోసం చేస్తారని జీసీసీ మేనేజర్ సిహ్.ఆములు అన్నారు. ఈ మేరకు సాలూరు మండలంలోని నేరెళ్ల వలస వారపు సంతలో మంగళవారం ఆయన గిరిజనులకు జీసీసీ కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతపండును కిలో రూ.36కు జీసీసీ కొనుగోలు చేస్తుందన్నారు. వర్తకులు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపుతారని గిరిజనులు వర్తకులకు చింతపండు అమ్మకాలు చేసి మోసపోవద్దని సూచించారు. అలాగే ఎవరైనా గిరిజనులను మోసం చేసి చింతపండు కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్దతు ధర రూ.50 చేస్తే మంచిది
చింతపండు మద్దతు ధర రూ.50 జీసీసీ చెల్లిస్తే బాగుంటుందని నేరెళ్ల వలసకు చెందిన వంతల గోపాల్‌తో పాటు ఎగువ సెంబి, దిగువసెంబి, కుంబిమడకు చెందిన గిరిజనులు కోరారు. వర్తకులు కిలోకి రూ.50 చెల్లిస్తున్నారని ప్రభుత్వం గమనించి చింతపండు మద్దతు ధర పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి రమేష్‌కుమార్ జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు.


