మూగవేదన
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో పశుసంపద కళకళలాడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 8,46,060 మూగజీవాలు ఉన్నాయి. వాటిలో ఆవులు, ఎడ్లు 2,28,681 కాగా, గేదెలు 76,017 వరకు ఉన్నాయి. ఇక గొర్రెలు 2,07,451, మేకలు 1,73,110, పందులు 5,089 ఉన్నాయి. లక్షల సంఖ్యలో కుటుంబాలు వాటి పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతటి ఘనమైన పాడి సంపద ఉన్నా..పాలకుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో ఆస్పత్రుల్లో కనీసం మందులు దొరకని దుస్థితి దాపురించింది.
ప్రైవేట్ షాపులే దిక్కు
సర్కారు దవాఖానాలో చికిత్స ఉచితమే అయినా..మందులు మాత్రం బయట కొనాల్సిందేనని వైద్యులు చీటీ రాసిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ జబ్బుకే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పాడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. పశువుకు జబ్బు చేస్తే, మాకు జ్వరం వచ్చినట్లే ఉంది. మందులు కొనలేక సతమతమవుతున్నామని పలువురు పాడిరైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణం స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు
జిల్లాలోని పశువైద్య కేంద్రాలకు గత ఏప్రిల్‌లో మందుల పంపిణీ జరిగింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మందుల నిల్వలు రావాల్సి ఉంది. అయితే అత్యవసర చికిత్సకు ఆటంకం కలగకుండా ఇతర కేంద్రాల నుంచి మందులను సర్దుబాటు చేయిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి అవసరమైన మందుల జాబితా (ఇండెంట్లు) పంపాం. కొద్ది రోజుల్లోనే జిల్లాకు పూర్తిస్థాయిలో మందుల సరఫరా జరిగే అవకాశముంది. డా.మన్మథరావు, జిల్లా పశువైద్యాధికారి, పార్వతీపురం మన్యం
సాధారణంగా పశువైద్యశాలలకు ప్రతి మూడు నెలలకోసారి (త్రైమాసికం) మందుల సరఫరా జరగాలి. కానీ, జిల్లాలో గత ఆరు నెలలుగా మందుల ఊసే లేదు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ లేదా అక్టోబర్ నాటికి రావాల్సిన మందులు ఇంతవరకు రాలేదు. జ్వరం, గాయాలు, ఇతరత్రా వ్యాధులకు వాడే యాంటీ బయాటిక్స్, నీరసిస్తే ఎక్కించే సైలెన్లు, పాల దిగుబడిని పెంచే కాల్షియం మందులు ఏప్రిల్ తర్వాత కేంద్రాలకు సరఫరా కాలేదు. ఉన్న నిల్వలు ఎప్పుడో అయిపోగా, ప్రస్తుతం ఆస్పత్రుల్లో మందుల అరలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో పశువైద్యులు సమీపంలోని ఇతర ఆస్పత్రుల నుంచి మందులు అరువు తెచ్చుకుని నెట్టుకొస్తున్నారు. సంచార పశువైద్య వాహనాల్లోనూ (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఇదే దీనస్థితి నెలకొంది.
పశువులకు వైద్యం కరువు
ప్రైవేట్ మందులతో పాడి రైతులకు భారం
ఆరునెలలుగా నిలిచిపోయిన మందుల సరఫరా
జిల్లాలో 8.46 లక్షల పశుసంపద ఉన్నా..సౌకర్యాల లేమి


