ధాన్యం తీసుకోం
● తిరిగి పట్టుకుపోండి
● రైతులను తూలనాడిన మిల్లు యజమాని
● ఆందోళనలో అన్నదాతలు
బలిజిపేట: బస్తాలకు ధాన్యం ఎత్తి నానా అవస్థలు పడి 21కిలోమీటర్ల దూరం మిల్లు వద్దకు తీసువచ్చారు. వాటిని మేం తీసుకోం..తిరిగి పట్టుకు వెళ్లిపోండని మిల్లు యజమాని తూలనాడడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏం చేయాలో తోచక కాళ్లూచేతులు ఆడలేదు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇదేం ఖర్మరా బాబూ అనుకున్నారు వంతరాం గ్రామరైతులు. బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ రైతుల ధాన్యాన్ని మిల్లరు కొనుగోలు చేయకపోవడంతో వారు ధాన్యం బస్తాలతో ఇటీవల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో మిల్లులకు 1:3నిష్పత్తిలో ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆ గ్రామ రైతులు సంతృప్తి చెందారు. వంతరాంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బి.వెంకటరమణ, ఎ.జనార్దన, ఒమ్మి సత్యనారాయణ, సతీష్, బి.శ్రీరామూర్తి, ఎన్.శ్రీనులకు చెందిన 480ప్యాకెట్లకు నాలుగు ట్రక్‌షీట్లు కొట్టించగా పి.చాకరాపల్లి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెన్నెల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరున ట్రక్‌షీట్లు వచ్చాయి. దీంతో రైతులు సంతోషంతో ధాన్యాన్ని 21కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లుకు ఆపసోపాలు పడి ఉదయం 10గంటలకు ముందే తీసుకువెళ్లారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైంది.
ట్రక్ షీట్లు రద్దు చేయండి
ధాన్యాన్ని తీసుకోనని, తిరిగి పట్టుకువెళ్లిపోండని మిల్లు యజమాని కరాఖండిగా చెప్పడంతో రైతులకు కాళ్లూచేతులు ఆడలేదు. ట్రక్‌షీట్ ఉంది ఎందుకు తీసుకోరని ప్రశ్నించినా మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండి నేను తీసుకోను అని తేల్చిచెప్పడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. అధికారులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదు. అదనంగా ఇంకా ఎన్ని ధాన్యం కావాలో చెప్పండి ఇచ్చేస్తాం, ఏదో విధంగా తీసుకోండని మిల్లు యజమానిని రైతులు ప్రాధేయపడ్డారు. అయినా యజమాని నుంచి స్పందన లేదు. దీంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. చివరకు ట్రక్‌షీట్లు రద్దు చేసేయండని, ధాన్యాన్ని పట్టుకుపోయి ఏదో ఒకటి చేసుకుంటామని, ఇదెక్కడి అన్యాయమని రైతులు లబోదిబోమన్నారు. రైతుసేవా కేంద్రాల వద్ద నుంచి ట్రక్‌షీట్లు వచ్చిన తరువాత మిల్లర్లు కాదనడం సమంజసంగా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం తీసుకోం


