గిరిజన పిల్లల ఎదురుచూపులు
● పీఎం జన్‌మన్ హాస్టల్స్‌కు మోక్షమెప్పుడు?
● మంజూరై రెండేళ్లయినా అతీగతీ లేదు
● మూలుగుతున్న రూ.6 కోట్ల 90 లక్షలు కేంద్రం నిధులు
సీతంపేట: గిరిజన ప్రాంతాల్లో పీవీటీజీ (పర్టిక్యులర్లీ వల్నర్‌బుల్ ట్రైబ్ గ్రూప్) తెగకు చెందిన గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వాటిలో ప్రధానమైన పీఎం జన్‌మన్ (ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకాన్ని 2023 నవంబర్ 15న ప్రారంభించింది. 9 మంత్రిత్వ శాఖల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి పక్కా ఇళ్లు వాటికి మరుగుదొడ్లు, పైప్‌లైన్ ద్వారా తాగునీరు, మొబైల్ మెడికల్ వ్యాన్‌లు, సేవలు, వంద జనాభా ఉన్న గ్రామాలకు టెలికాం టవర్లు, రోడ్లు, విద్యుత్ రహిత గృహాలకు విద్యుత్ సోలార్ లైటింగ్, జీవనోపాధికి వనధన్ వికాస కేంద్రాలు, విద్యలో భాగంగా హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పథకంలో పీవీటీజీలు లబ్ధిపొందాలనేదే పథకం ఉద్ధేశం. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట ఏజెన్సీలో ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల సంఖ్య 49,611 మంది ఉన్నారు. మొత్తం 12,488 కుటుంబాలు ఉన్నాయి.
ఇదీ పరిస్థితి..
అత్యంత ఎత్తైన కొండపై మారుమూల ఉన్న గిరిజన గ్రామాలను ఎంపిక చేసి మూడు చోట్ల ప్రత్యేక గిరిజన మోడల్ వసతిగృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. మండలంలోని గుడ్డిమీదగూడ, చదునుగూడ, తలైబుగూడ గ్రామాల్లో వసతిగృహాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిసరాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న 50 మంది చొప్పున విద్యార్థులను మొత్తం 150 మందిని ఆ హాస్టల్స్‌లో చేర్పించేందుకు విద్యాశాఖాధికారుల ప్రతిపాదన సిద్ధమైంది. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అక్కడ చేసి, మధ్యాహ్న భోజనం మాత్రం ఆయా పాఠశాలల్లో చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. పోషకాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం, టీచర్లతో పాటు ప్రత్యేక ట్యూటర్లను నియమించి విద్యాబోదన చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఇందుకు రూ.ఒక్కోవసతి గృహానిర్మాణానికి రూ.2 కోట్ల 30లక్షలు చొప్పున మొత్తం రూ.6 కోట్ల 90లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్లయినా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు జరగలేదు.
విద్యార్థులను ఎంపిక చేశాం
మోడల్ వసతిగృహాలకు సంబంధించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తయ్యాయి. స్థల సేకరణ కూడా రెండు వసతిగృహాలకు జరిగింది. పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇంకా తలైబుగూడ వసతిగృహం పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
గిరిజన పిల్లల ఎదురుచూపులు


