మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారవేదికలో ఇచ్చే అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్జీల స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
31న తోటపల్లి ఆలయ
హుండీల ఆదాయం లెక్కింపు
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం ఈనెల 31న బుధవారం నిర్వహిస్తున్నట్లు ఈఓ బి.శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మూడు నెలలకోసారి భక్తులనుంచి వచ్చిన కానుకలు, విరాళాలను దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించే ఈలెక్కింపు కార్యక్రమంలో దాతలు, భక్తులు, స్వామివారి సేవకులు పాల్గొనాలని కోరారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు, సేవకులు తెల్లని పంచె, తెల్లని బనియన్ మాత్రమే ధరించి రావాలని స్పష్టం చేశారు.
నేడు చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకోనున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతర తొలిఘట్టం పోలమాంబ అమ్మవారి మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని చదురుగుడికి తీసుకువస్తారు. పోలమాంబ మేనత్త పెద పోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్ని వారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల కోలాహం, వాయిద్యాలు, డప్పుల మధ్య పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోనీ చదురుగుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పెద పోలమాంబ అమ్మవారిని తీసుకువచ్చేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
విజయనగరం టౌన్: జిల్లాకు చెందిన ధర్మాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ పీఎస్‌వీ.కామేశ్వరరావుకు ఉత్తమ నాట్యాచార్య పురస్కారం దక్కింది. జాతీయస్థాయి కూచిపూ డి నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ ఉపద్రష్ట ఫంక్షన్ హాల్‌లో ద్వారకాసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు దక్కినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నృత్యప్రదర్శన చేసిన చిన్నారులకు ఉత్తమ నా ట్య ప్రతిభా పురస్కారాలు అందజేశారన్నారు. మచిలీపట్నం ఎమ్మార్వో హరినాథ్ చేతుల మీదుగా తాము పురస్కారాలు అందుకున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
విజయనగరం టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని రింగురోడ్డులో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వామివారికి శ్రీనివాసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా సంకీర్తనలు, గోవిందనామ భజనలు, అష్టోత్తర శతనామార్చనలతో భక్తిభావం పెంపొందింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి, తరించారు.
మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల నమోదు


