
సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన రెవెన్యూ, సంక్షేమం, అభివృద్ధి రెండు విభాగాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 102 వినతులను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, పాలకొండ సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌ఓ కె. హేమలత, ఎస్‌డీసీలు పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు ఎం.సుధారాణీ , కె.రామచంద్రరావులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖాధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తూ సమస్యలను సంపూర్ణంగా విన్నవించుకునే విధంగా అర్జీదారులకు అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజల పిటిషన్లకు పరిష్కారం
ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లకు పరిష్కారం చూపిస్తూ, వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి సంబంధిత పోలీసు శాఖాధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 5 పిటిషన్లు స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 23 వినతులు వచ్చాయి. ఏపీఓ జి.చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. తాడిపాయికి చెందిన నందిని భాషా వలంటీర్ పోస్టు ఇప్పించాలని కోరారు. పాతూరుకు చెందిన ఢిల్లేశ్వరరావు ఏదైనా ఆశ్రమపాఠశాలలో కుక్, కమాటి పోస్టులో నియమించాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తకోటలో ఉన్న అంగన్‌వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మినీగురుకులానికి మౌలికవసతులు కల్పించాలని కె.వీరఘట్టానికి చెందిన బి.నీలకంఠం అర్జీ అందజేశాడు. అచ్యుతాపురానికి చెందిన బి.సుశీల వాటర్‌ప్లాంట్ మంజూరు చేయాలని కోరింది. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ రామ్మోహన్‌రావు, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు.

సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం

సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం