
రీఅసెస్‌మెంట్ పూర్తయినా అందని టీఏడీఏలు..!
విజయనగరం ఫోర్ట్: దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట కూటమి సర్కార్ తీసుకొచ్చిన సదరం సర్టిఫికెట్‌ల రీవెరిఫికేషన్ నిర్వహించిన వైద్యులకు చెల్లించాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా కూటమి సర్కార్ జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీ అసెస్‌మెంట్ జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీఏ, డీఏలు చెల్లించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత డబ్బులు పెట్టుకుని వైద్యులు వివిధ ప్రాంతాల నుంచి రీ అసెస్‌మెంట్ చేయడానికి ఆస్పత్రులకు వచ్చారు. రీ అసెస్ మెంట్ చేసినందుకు గాను వారికి చెల్లించాల్సిన టీఏ. డీఏలకు సంబంధించి డబ్బులు మాత్రం చెల్లించకుండా కూటమి సర్కార్ జాప్యం చేయడం పట్ల వైద్యులు ఆవేదన చెందుతున్నారు.
రీ అసెస్‌మెంట్ నిర్వహించిన ఆస్పత్రులు
జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం, సాలూరు ఏరియా ఆస్పత్రులు, పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్ నిర్వహించారు.
రీఅసెస్ మెంట్‌లో 40 నుంచి 50 మంది వైద్యులు
2025 జనవరిలో కూటమి ప్రభుత్వం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు రీఅసెస్‌మెంట్ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి నెలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వారంలో మూడు రోజుల పాటు దివ్యాంగులకు రీ అసెస్ మెంట్ చేసేవారు. బుధ, గురు, శుక్రవారాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్‌మెంట్ నిర్వహించారు.
30వేల మందికి పైగా దివ్యాంగులకు పరీక్షలు
జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీఅసెస్‌మెంట్ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్‌మెంట్ సర్టిఫికెట్స్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. కంటి, ఎముకలు, ఈఎన్‌టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి 30 వేలమందికి పైగా దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్‌మెంట్ నిర్వహించారు.
దూర ప్రాంతాల నుంచి వైద్యుల రాక
జిల్లాలో దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్ నిర్హహించేందుకు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చేవారు.
త్వరలో చెల్లిస్తాం
దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉంది. నిధులు వచ్చాయి. త్వరలోనే చెల్లిస్తాం.
– డాక్టర్ పద్మశ్రీ రాణి,
జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి
దివ్యాంగులకు సదరం రీ అసెస్‌మెంట్ చేసిన వైద్యులు
జిల్లాలో ఈఏడాది జనవరి నుంచి ప్రారంభమైన ప్రక్రియ
30 వేలకు పైగా దివ్యాంగులకు
పరీక్షలు చేసి రీఅసెస్‌మెంట్
వైద్యులకు టీఏ, డీఏల బకాయి