
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
● కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి
విజయనగరం: పైడితల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పది అంశాలను అజెండాలో పొందుపరచగా.. సభ్యులు ఆమోదించారు. పైడితల్లి జాతర నేపథ్యంలో కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు వివరించారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. వీధి దీపాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య పనులపై దృష్టి సారించామని చెప్పారు. ఫ్లోర్‌లీడర్ ఎస్‌వీవీ రాజేష్ మాట్లాడుతూ.. ఉత్సవాలు విజయవంతం కావడానికి అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. సమావేశంలో కమిషనర్ పల్లి నల్లనయ్య, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణిక్య, జీవీ రంగారావు, సుంకర నారాయణస్వామి, రేగాన రూపాదేవి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.