
టీడీపీ నేత ఇంటికి ఎరువులు
● పీఏసీఎస్ నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుపడిన సొసైటీ అధ్యక్షుడు
● తొలుత సొంతానివంటూ బుకాయింపు
● నకిలీ బిల్లులతో మభ్యపెట్టే ప్రయత్నం
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి నేతల ఇళ్లకు ఎరువులు తరలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించిన దాఖలాలు లేవు. సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెబుతున్న అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలిసి కూడా మిన్నుకుంటోంది. ఏకంగా పీఏసీఎస్ నుంచి సొసైటీ అధ్యక్షుడే యూరియా, ఎరువులను అక్రమంగా తరలిస్తూ, పట్టుపడిన ఘటన స్వయంగా రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఆటోలో తరలింపు.. తొలుత బుకాయింపు
పాచిపెంట పీఏసీఎస్ సొసైటీ నుంచి సాలూరు వైపుగా ఆటోలో 11 యూరియా, 3 పొటాష్ ఎరువు బస్తాలను శనివారం తరలిస్తుండగా పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో విజిలెన్‌న్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఎరువులు కేసలి పీఏసీఎస్ అధ్యక్షుడు మాదిరెడ్డి మజ్జారావుకు చెందినవిగా గుర్తించారు. తాను సాలూరు సమీపంలో సుమారు 11 ఎకరాల పామాయిల్ తోటను సాగు చేస్తున్నానని, అక్కడికి తీసుకెళ్తున్నట్లు ఆయన చెబుతూ, బిల్లులను చూపించారు. వాటిని పరిశీలించి.. అవి సరైనవి కాదని విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. టీడీపీ నాయకుడు మజ్జారావుపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎరువు బస్తాలను పి.కోనవలస రైతు సేవా కేంద్రంలో భద్రపరిచినట్లు విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
పీఏసీఎస్‌లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
కేసలి పీఏసీఎస్‌లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని అధికారులు గుర్తించారు. 154 బస్తాల పొటాష్ అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేసినా పీఏసీఎస్ ద్వారా కేవలం ఒకట్రెండు బస్తాలు ఇచ్చి పంపించేస్తున్నారని.. ఇలాంటి నాయకులు మాత్రం లోడ్లు తరలించుకుపోతున్నా రని స్థానికంగా కర్షకులు ఆవేదన చెందుతున్నారు.