
కేంద్రాస్పత్రిలో సౌకర్యాల కల్పనకు ఆమోదం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రాస్పత్రిలో తాగునీరు, ప్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, పెయింటింగ్స్, లిఫ్ట్ నిర్వహణ, మరమ్మతు పనులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆస్పత్రిలో నీటికొరత లేకుండా చూడాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శివనాగజ్యోతి మాట్లాడుతూ ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, వసతులు కల్పించాలని కోరారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, డీసీహెచ్ జి.నాగభూషణరావు, డీఎంహెచ్‌ఓ ఎస్. భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
గృహనిర్మాణాలు పూర్తిచేయాలి
పార్వతీపురం రూరల్: గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పార్వతీపురం మండలంలోని హెచ్ కారాడవలస, పార్వతీపురం మున్సిపాల్టీకి సంబంధించిన లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలను ఆయన శనివారం పరిశీలించారు. 181 గృహాల్లో కొన్నిమాత్రమే పూర్తిచేయడంపై అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు వేగంగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఆయన వెంట గృహ నిర్మాణ సంస్థ ఇన్‌చార్జి పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజు ఉన్నారు.