
రెండు నిండు ప్రాణాలు
● కారు ఢీకొని ఇద్దరి దుర్మరణం ● మృతుల్లో ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, మరొకరు ప్రైవేటు ఉద్యోగి ● పైళ్లెన ఐదు నెలలకే.. ● మరో ఇద్దరికి గాయాలు ● వీరిలో ఒకరి పరిస్థితి విషమం
నిర్లక్ష్యం ఖరీదు...
జామి:
కారు డ్రైవరు నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామానికి చెందిన నలుగురు కారులో ఆదివారం రాత్రి అలమండ వైపు బయలుదేరారు. అదే సమయంలో అలమండ నుంచి రెండు వేర్వేరు బైక్‌లపై భీమాళి, శిరికిపాలెం వస్తున్న యువకులను అలమండ పెట్రోల్ బంకు సమీపంలో కారు డ్రైవరు నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టాడు. దీంతో బైక్‌లపై ప్రయాణిస్తున్న శిరికిపాలెం గ్రామానికి చెందిన బోని సాగర్(25), భీమాళి గ్రామానికి చెందిన గుల్లిపల్లి సురేష్(32) అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న భీమాళికి చెందిన మరో వ్యక్తి మిడతాన సూర్యప్రకాష్(26) తీవ్రంగా గాయపడ్డాడు. సూర్యప్రకాష్‌ను 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కంటకాపల్లికి చెందిన పి.సాయిప్రకాష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జయింది. ఘటనా స్థలానికి ఎస్‌ఐ వీరజనార్ధన్ చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పైళ్లెన ఐదు నెలలకే...
భీమాళి గ్రామానికి చెందిన గుల్లిపల్లి సురేష్ గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం సురేష్ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. సురేష్‌కు ఐదు నెలల కిందటే సుస్మిత అనే అమ్మాయితో వివాహమైంది. ఇంతలోనే సురేష్‌ను మృత్యువు కారు రూపంలో కబళించడంతో ఇటు కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది. ఇరువైపులా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఒకే ఒక్కడు...
బోని అప్పలనాయుడు, దేముడమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సాగర్. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబానికి సాగరే పెద్ద దిక్కుగా ఉన్నాడు. సాగర్ కంటకాపల్లి సమీపంలోని శారదా కంపెనీలో పని చేస్తున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కు సాగర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

రెండు నిండు ప్రాణాలు

రెండు నిండు ప్రాణాలు

రెండు నిండు ప్రాణాలు