
గణనాథుడి ఊరేగింపులో ఘర్షణ
● ఇరువర్గాల మధ్య వివాదం
● భారీగా మోహరించిన పోలీసులు
● గ్రామంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గణనాథుడి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్సీ కాలనీ ప్రజలు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి శనివారం రాత్రి శ్రీకారం చుట్టారు. ఊరేగింపులో భాగంగా గ్రామ ప్రధాన రహదారి నుంచి వెళ్లేందుకు యత్నించగా బీసీ వర్గాలు అడ్డుకున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత తమ పట్ల, తమ ఆడబిడ్డల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బీసీ వర్గానికి చెందిన మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇళ్ల ముందు నుంచి ఊరేగింపు చేయడానికి వీలులేదంటూ అడ్డుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ..సుమారు 20 మంది సిబ్బందితో గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తగాదా పెరగకుండా నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాన్ని పోలీసులే చేపట్టారు. ఇదిలా ఉండగా దళితులమనే అక్కసుతోనే తమ గణనాథుడి నిమజ్జనానికి అడ్డు తగిలారంటూ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు చెబుతున్నారు. వివక్ష చూపిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ రామకృష్ణను వివరణ కోరగా ఘటన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్‌ను కొనసాగిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన సుమారు 30 మందిపై చర్యలు తీసుకోవాలని దళిత వర్గానికి చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారని వారి ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పారు.