
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమవ్వాలి
విజయనగరం క్రైమ్: ఈ నెల 13న జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాద కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఇందుకుగాను పోలీసు స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిరోజూ లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతమయ్యేందుకు సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలన్నారు. సమన్వయంతో పని చేస్తే త్వరగా కేసులు సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులను ప్రతిరోజూ ఆయా సబ్ డివిజన్‌లకు చెందిన డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.