
మండుటెండలో నిలబడాలా?
ఎరువుల కోసం
పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వ హయాంలో రైతన్నకు కష్టకాలం దాపురించిందని, ఎరువు కోసం మండుటెండలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి రావడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. ప్రభుత్వం సకాలంలో సక్రమంగా ఎరువులు పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని వాపోయారు.
పార్వతీపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే ‘ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు’కు సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతులకు ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, చివరకు రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా అమరావతిలో వర్షాల కారణంగా వచ్చిన వరదనీటిని తోడే పనిలో కూటమి నాయకులంతా నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు నిరీక్షించే పరిస్థితి ఏ రోజు కనిపించలేదన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ 9న రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్.శరత్, ఎస్.శ్రీనివాసరావు, పి.సత్యనారాయణ, మల్లిబాబు, ఎం.శేఖర్, రవికుమార్, షఫీ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
రైతన్న ఎరువు కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదు
రైతుల పక్షాన ఈ నెల 9న వైఎస్సార్‌సీపీ పోరుబాట
విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పరీక్షిత్‌రాజు పిలుపు