సాగుకు ముందస్తు సన్నద్ధం! | - | Sakshi
Sakshi News home page

సాగుకు ముందస్తు సన్నద్ధం!

May 25 2025 8:12 AM | Updated on May 25 2025 8:12 AM

సాగుక

సాగుకు ముందస్తు సన్నద్ధం!

ప్రభుత్వానికి రైతుల విన్నపం

రైతులు అప్రమత్తంగా ఉండాలి

రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో ముందుగా ఆర్‌ఎస్‌కేలలో లభించని విత్తనాలను ప్రభుత్వం గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. కొద్దిపాటి విత్తనాలను మొలకెత్తించాలి. 80 శాతం పైగా విత్తనాల మొలకల్లో తేడా వస్తే తక్షణమే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రతీ రైతు తాను కొనుగోలు చేసిన విత్తనాల షాపు యజమాని నుంచి రశీదు తీసుకోవాలి. కల్తీ విత్తనాలతో మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. నష్టపోయిన రైతులు పరిహారం అందుకోవడానికి ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. వరి విత్తనాలు తెచ్చిన సంచులు జాగ్రత్తగా వుంచాలి. పంట చేతికి వచ్చే వరకు రైతులు విత్తనాలకు సంబందించిన అన్నీ ఆధారాలు భద్రంగా ఉంచడం రైతులకు మేలు. – వీటీ రామారావు,

వ్యవసాయ శాఖ జేడీ, విజయనగరం

కల్తీ విత్తనాలతో తస్మాత్‌..

ప్రభుత్వ లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి

రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు

రామభద్రపురం: ఖరీఫ్‌కు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సీజన్‌ ప్రారంభంలోనే విత్తు పడితే సిరుల పంట పండుతుందని రైతుల నమ్మకం. జిల్లాలో ప్రధానంగా వరి 91,214 హెక్టార్లు, మొక్కజొన్న 12,386 హెక్టార్లు, పత్తి 2142 హెక్టార్లు, చెరకు 4,720 హెక్టార్లు, వేరుశనగ 369 హెక్టార్లు, వివిధ రకాల కూరగాయలు 350 హెక్టార్లలో సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి అకాల వర్షాలు పడడం వల్ల రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. పొలాలకు ఎరువులు తీసుకువెళ్లడం, దుక్కులు దున్నడం లాంటి పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే వర్షాలు సమృద్ధిగా పడతాయో ఆ క్షణమే పొలంలో విత్తనాలు విత్తేందుకు వీలుగా పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే విత్తనాలు తీసుకొని, ఇక్కడ అందుబాటులో లేని విత్తనాలను రైతులు ప్రైవేటు దుకాణాలపై ఆధారపడుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు తమ వద్ద లభిస్తాయంటూ కొందరు వ్యాపారులు రైతులను మభ్య పెడుతున్నారు. కల్తీ విత్తనాల బారిన పడి రైతులు ప్రతీ ఏడాది నష్టపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలను ముందే గుర్తించకపోతే నష్టపోక తప్పదని వ్యవసాయ శాఖాధికారులు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం జరిగినా ఆ తర్వాత సంబంధిత కంపెనీల నుంచి పరిహారం పొందవచ్చు.

రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు

రైతు భరోసా కేంద్రాల్లో లభించని విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. కొన్నిచోట్ల ప్రభుత్వం అనుమతి లేకపోయినప్పటికీ అనధికారంగా కల్తీ విత్తనాలు తెల్ల సంచుల్లో విక్రయించే అవకాశం ఉంది. అలా విక్రయించే వారి సమాచారాన్ని తక్షణమే వ్యవసాయ శాఖాధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల నుంచే సర్టిఫైడ్‌ విత్తనాలు తీసుకోవాలి. విత్తనాలతో పాటు బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు సాగు చేసే రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాలు విక్రయించే డీలర్లకు, వ్యవసాధికారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో దుకాణాలు యజమానులు విచ్చలవిడిగా విత్తనాలను విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన రైతులు. వీరు ఏమంటున్నారంటే.. గత ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కలిపి రైతులకు ఏటా రూ.13,500లు మూడు దఫాలుగా అందించేది. దీని వలన ఖరీఫ్‌లో పంట పెట్టుబడికి వెసులుబాటు ఉండేది. తొలి విడతగా మే నెలలోనే రూ.7,500లు రైతు ఖాతాల్లో జమ చేసేది. దీని వలన చిన్న సన్నకారు, పేద రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడి చాలా వరకు కలిసి వచ్చేది. మే నెలతో పాటు అక్టోబరు, జనవరి నెలల్లో నిధులు రైతుల ఖాతాల్లో పడేవి. వైఎస్సార్‌ రైతుభరోసా తొలి విడతగా రూ.5500లు, రెండవ విడత అక్టోబరు నెలలో రూ.2 వేలు చొప్పున్న అందించేవారు. కేంద్రం పీఎం కిసాన్‌ నిధిగా రూ.6 వేలను మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున్న ఇచ్చేవారు. ఈ ఏడాది మే నెల దాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 వేలకు సంబంధించి ఇప్పటి వరకు జీవో అతిగతీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పెట్టుబడి సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

సాగుకు ముందస్తు సన్నద్ధం!1
1/3

సాగుకు ముందస్తు సన్నద్ధం!

సాగుకు ముందస్తు సన్నద్ధం!2
2/3

సాగుకు ముందస్తు సన్నద్ధం!

సాగుకు ముందస్తు సన్నద్ధం!3
3/3

సాగుకు ముందస్తు సన్నద్ధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement