నరసరావుపేట రూరల్: పచ్చమూకల దాడులు, దౌర్జన్యాలు, పోలీసులు బెదిరింపుల నడుమ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జొన్నలగడ్డలో పచ్చమూకలు పోలింగ్ కేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. పోలింగ్ కేంద్రంలోని వైఎస్సార్ సీపీ ఏజెంట్లుపై దాడి చేసి బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అదనపు ఎస్పీ హనుమంతరావు సైతం బెదిరించినట్టు వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లు ఆరోపించారు. పోలీసులు, కూటమి నాయకులు కలిసి దౌర్జన్యంగా పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. తమకు ఓటు వేసుకునే హక్కు కల్పించాలని గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. పోలీసులు వీరిని బలవంతంగా పంపించి వేశారు. ఈ సందర్భంగా 20మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డిపాలెం నుంచి ఓట్లు వేసేందుకు జొన్నలగడ్డకు వస్తున్న వారిని టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పచ్చమూకలు రిగ్గింగ్‌ను అడ్డుకుంటున్న వైఎస్సార్ సీపీ మద్దతుదారులను పోలీసులు లాఠీచార్జ్ చేసి నిలువరించారు. ఏకపక్షంగా జరిగిన పోలింగ్‌లో టీడీపీ బలపరిచిన అభ్యర్ధి యర్రా పుష్పలత 1346 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
● పెదతురకపాలెంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికలను బహిష్కరించింది. అల్లూరివారిపాలెం – ఉడతా రాఘవ(253 ఓట్లు), పెదతురకపాలెం – షేక్ దరియావలి( 530 ఓట్లు), కాకాని – దండా అనూరాధ( 389 ఓట్లు), కేఎం అగ్రహారం– చుక్కపల్లి హనుమాయమ్మ(91 ఓట్లు), పమిడిమర్రు– గర్నెపూడి యేనుకు ( 150 ఓట్లు), గురవాయపాలెం– చుండు రాములమ్మ ( 67 ఓట్లు)తో సర్పంచ్ అభ్యర్ధులుగా విజయం సాధించారు.


