వైఎస్సార్‌ సీపీ, పోలీసుల మధ్యే పోరు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ, పోలీసుల మధ్యే పోరు

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

నరసరావుపేట: మున్సిపల్‌ ఎన్నికలు వైఎస్సార్‌ సీపీ, పోలీసుల మధ్యనే జరిగాయని, టీడీపీకి, తమ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలు కావని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు జరిగిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. పోలింగ్‌ జరిగిన 46 వార్డుల్లో 33 వార్డులకు బూత్‌ల్లో ఆక్రమణ జరిగిందన్నారు. టీడీపీ వారు ఎన్నికల్లో పాల్గొనలేదని, పోలీసులే నడిపించారన్నారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలు గెలిచారని, వారందరికీ తమ శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేశారు. మధ్యాహ్నం నుంచి రిగ్గింగ్‌ చేస్తారని ముందే తాము చెప్పినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులు, టీడీపీ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. టీడీపీ నాయకులు బూత్‌లోకి వచ్చి ఏజెంట్లును బలవంతంగా బయటకు పంపటం, దానికి పోలీసులే వత్తాసు పలకటం దారుణంగా ఉందన్నారు. దీంతో పాటు తమ పార్టీకి చెందిన ముఖ్యనాయకులను అరెస్టు చేశారన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో 11గంటల నుంచే బూత్‌ల ఆక్రమణ ప్రారంభించారన్నారు. తాను కారప్పొడి పొట్లాలు అంటే తనపై కేసు పెట్టి అక్రమంగా హౌస్‌ అరెస్టు చేశారన్నారు.

ఎలక్షన్స్‌ కావివి సెలక్షన్స్‌ ..

నరసరావుపేటలో ఎన్నికలు అంటే మాచర్ల, చిలకలూరిపేట, పెదకూరపాడు నుంచి టీడీపీ నేతలు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మూడు సుమోలతో వారు వచ్చారన్నారు. వారు ఎక్కడినుంచైనా రావొచ్చుకాని, తనను మాత్రం హాస్పిటల్‌ నుంచి కదలకుండా చేశారన్నారు. ఎలక్షన్‌ బదులు సెలక్షన్‌ చేసుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. 33 వార్డుల్లో రిగ్గింగ్‌ చేశారని, 12వార్డుల్లో మాత్రమే ఆటంకాలు లేకుండా పోలింగ్‌ జరిగిందన్నారు. అయినప్పటికీ నిజాయతీగా ఓట్ల లెక్కింపు జరిగితే 12వార్డుల్లో అత్యధిక స్థానాలు తమవే అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే 46కు 26 నుంచి 28 వార్డులు తాము గెలిచి ఉండేవారమని అన్నారు. ప్రకాష్‌నగర్‌లోని వార్డుల్లోని ఐదింటిలోను, రామిరెడ్డిపేట, బరంపేట వార్డుల్లో అత్యధికం తామే గెలిచేవారమని అన్నారు. 2029లో మూడు పార్టీలు కలిసి వచ్చినా తామే గెలుస్తామన్నారు.

మొత్తం 46 వార్డులకు గాను

33 వార్డుల్లో రిగ్గింగ్‌

కూటమికి పూర్తిగా సహకరించిన పోలీసులు

అత్యధిక స్థానాలు వారు గెలిచినా

నైతిక విజయం మాదే

విలేకరుల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement