గుంటుపాలెంలో పంచాయతీ ఎన్నికల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

గుంటుపాలెంలో పంచాయతీ ఎన్నికల బహిష్కరణ

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

ఉద్యోగుల విషయంలో విలువలు పాటించాలి

శావల్యాపురం: మండలంలోని గుంటుపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ ఎన్నికలను వైఎస్సార్‌ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు గురువారం బహిష్కరించారు. భాస్కర్‌నగర్‌ గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు దేవిరెడ్డి సూర్యప్రభాకర్‌రెడ్డి తన భార్య వరలక్ష్మి 8వ వార్డు సభ్యురాలిగా బరిలో దింపారు. బుధవారం రాత్రి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు ఎస్‌ఐ మోర్ల వెంకటేశ్‌బాబు తన సిబ్బందితో బెదిరింపులకు పాల్పడి వైఎస్సార్‌ సీపీ వారి ఇళ్లలో సోదాలు చేశారు. పోలీసు స్టేషనుకు తీనుకెళ్లారు. యువకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నికల నుంచి తప్పుకోవాలని తీవ్రస్ధాయిలో దూషించి పరుష పదజాలంతో దూషించారు. పోలీసు స్టేషనుకు తరలించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పోలీసు స్టేషను వచ్చి అక్రమ అరెస్ట్‌లకు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న యువకులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి స్వగ్రామానికి వచ్చారు. పోలీసుల తీరు, అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జనకాండను చూసి తమకు ఎన్నికల వద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఏజెంట్లను సైతం పోలింగ్‌ కేంద్రాల్లో అనుమతి ఇవ్వకపోవటంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏకపక్షంగా అధికారపార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవంగా చేసుకున్నారు.

పని చేస్తుండగానే కబళించిన మృత్యువు

యడ్లపాడు: రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. భర్త రోజూ మాదిరిగానే భార్యతో కలిసి ఉపాధి పనులకు వెళ్లాడు. పని చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. జగ్గాపురానికి చెందిన చాపల సాంబశివరావు(39) మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. గ్రామంలో పోపూరి రాంబాబు పొలం సమీపంలో ఫీడర్‌ చానల్‌ పనులు చేపట్టారు. మూడు రోజులుగా సాంబశివరావు, ఆయన భార్య నందిని ఆ పనులకు వెళ్తున్నారు. గురువారం ఉదయం కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ విజయేంద్రరావు ఆన్‌లైన్‌ హాజరు వేశారు. దంపతులు మొత్తం పది మీటర్ల మేర పనులు చేశారు. సాంబశివరావు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కూలీలు వెంటనే ఆటోలో యడ్లపాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. సాంబశివరావు నీలంపాటి అమ్మవారి మాలధారణలో ఉన్నాడు. డిసెంబరు 10న అమ్మవారి ఆలయానికి వెళ్లి దీక్ష విరమించాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రి మరణంతో ఇద్దరు బాలికల రోదనలు గ్రామస్తులను సైతం కలచివేశాయి.

బైక్‌ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

బెల్లంకొండ: నడిచి వస్తున్న మహిళను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని వెంకటాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహిళ తుపాకుల వెంకాయమ్మ అయ్యప్ప మాల ధరించారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఊళ్లో నుంచి గ్రామం చివరన గల ఆంజనేయ స్వామి గుడి వద్దకు నడిచి వస్తున్నారు. ఎదురుగా అదే గ్రామానికి చెందిన అగ్రహారం బాలాజీ అనే వ్యక్తి బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. వెంకాయమ్మకు కాలు విరగడంతోపాటు ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం అందించారు. ఆమెను వాహనంలో పిడుగురాళ్లలోని వైద్యశాలకు తరలించారు.

గుంటూరు వెస్ట్‌: ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల విషయంలో రాజ్యాంగ విలువలను పాటించాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించిన ప్రదర్శనలో ఏపీజీఈఏ జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు, ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించేలా చట్టం చేయాలని 19 జనవరి 2023న రాష్ట్ర గవర్నర్‌కు చేసిన అభ్యర్థనకు కట్టుబడి ఉంటామన్నారు. తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement