రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన అభ్యర్థి
నరసరావుపేట: తమ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపి టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేసుకున్నారంటూ 12వ వైఎస్సార్ సీపీ అభ్యర్థి షేక్ చమన్‌భీ తన మద్దతుదార్లతో పోలింగ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై కూర్చోని రాస్తారోకో చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు జులుం నశించాలని నినాదాలు చేశారు. రీపోలింగ్‌కు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరటంతో వారు విరమించారు.
పత్తి లారీ బోల్తా
చిలకలూరిపేటటౌన్: మండలంలోని లింగంగుంట్ల గ్రామ సమీపంలో పత్తి లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పత్తి బేళ్లు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పత్తి బేళ్లను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
రెంటచింతల: మండలంలోని మిట్టగుడిపాడు గ్రామ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల రెండవ అంతస్తు నుంచి జారిపడి ఓ సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. మాచర్ల పట్టణానికి చెందిన తాళ్ల శ్రీనివాస రావు(40) సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. గురుకుల పాఠశాలకు కూడ రెండో అంతస్తులో పని చేస్తున్న సమయంలో కాలుజారి కింద పడిపోయాడు. 108 ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే క్షతగాత్రుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య రమాదేవి, కుమార్తె ఉన్నారు. మృతుని తండ్రి తాళ్ల దేషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు.
అనారోగ్యంతో కానిస్టేబుల్ మృత్యువాత
నగరంపాలెం: ఎస్సీ, ఎస్టీ సెల్‌లో అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తున్న వట్టిచెరుకురు పీఎస్ కానిస్టేబుల్ పచ్చి పాల హరికృష్ణ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన మృతిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రూ.లక్ష నగదును మృతుని భార్య శిరీషకు పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం.లక్ష్మయ్య, ఈసీ సభ్యులు కరిముల్లా, ఎస్సీ, ఎస్టీ సెల్ ఏఎస్‌ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
బీరు సీసాతో హత్యాయత్నం
తెనాలిరూరల్: తన తమ్ముడిపై ఎందుకు దాడి చేస్తున్నావని అడిగినందుకు అన్నపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదైంది. మండల పరిధిలోని అంగలకుదురుకు చెందిన రత్తయ్యపై మూకర రామకృష్ణ ఈ నెల 16వ తేదీన దాడికి దిగాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న రత్తయ్య సోదరుడు సుబ్బారావు దీనిపై ప్రశ్నించారు. దీంతో బీరు సీసా పగలగొట్టిన రామకృష్ణ... సుబ్బారావుపైనా దాడి చేశాడు. వీపు భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స కోసం వైద్యశాలలో చేరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంపీ మృతి
తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంపీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన రాసాపుత్ర రాంబాబు సింగ్(60) ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నాడు. బుధవారం తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల్లూరులో ఉన్న మృతుడి బంధువులు గురువారం వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెనాలిరూరల్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుగ్గిరాల–పెదవడ్లపూడి స్టేషన్‌ల మధ్య బుధవారం జరిగింది. దుగ్గిరాల గ్రామానికి చెందిన అద్దూరి నాగరాజు(33) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమీచీరం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు గురువారం అప్పగించారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.


