వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను గెలిపించండి

Nov 26 2026 1:29 AM | Updated on Nov 26 2026 1:29 AM

నేడు సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల నరసరావుపేటలో మద్యం, డబ్బు పంపిణీ పల్నాటి ఉత్సవాలకు సిద్ధం

పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి

మాచర్ల: పల్నాడు జిల్లాలో మొదటి విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండవ విడత పుర పాలక సంఘ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, మద్దతుదారులను గెలిపించాలని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి ఆయన కార్యాలయంలో మాట్లాడారు. టీడీపీ రౌడీ మూకలు దాడులు చేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, మద్దతుదారులను నామినేషన్లు వేయనీయలేదన్నారు. టీడీపీ అరాచకాలను ఎదుర్కొని వైఎస్సార్‌ సీపీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థులు, నరసరావుపేటలో పురపాలక సంఘంలో అభ్యర్థులు రంగంలో ఉన్నారన్నారు. ఓటర్లు ధైర్యంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. స్థానిక ఎన్నికల ముందు కొత్త పింఛన్‌ల కోసం 13 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క కొత్త పింఛనూ ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాలను మోసగించటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన విషయాన్ని గమనించి సీఎం చంద్రబాబు అనేక డ్రామాలకు తెరతీసి నానా రకాలుగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారన్నారు. చివరికి పార్టీల గుర్తు లేని పంచాయతీ ఎన్నికల్లో సైతం పోలీసుల ద్వారా పలు కుట్రలు కొనసాగిస్తున్నారన్నారు. వీటిని వ్యతిరేకించి ప్రజలు పాలక పక్షానికి బుద్ధి చెప్పేలా పంచాయతీ, పురపాలక సంఘ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

మాచర్ల: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్‌ఎస్‌పీ లింగంగుట్ల, కుడి కాలువ ఎస్‌ఈ రమేష్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీటి విడుదల వివరాలు వెల్లడించారు. మొత్తం తాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి ఎనిమిది టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిని చెరువులు, కుంటలు, పురపాలక సంఘ స్టోరేజ్‌ ట్యాంక్‌లకు నింపుకోవాలన్నారు. సాగు నీటి అవసరాలకు ఉపయోగిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలన్నారు.

నరసరావుపేట: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పట్టణంలో కూటమి అభ్యర్థులు మద్యం, డబ్బు ఏరులై పారించారు. ప్రతి ఓటరుకు రూ. వేయి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేశారు. ప్రతి అభ్యర్థి తమ పరిధిలోని ఓటర్లకు 25 కేసుల వరకు మద్యం పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. స్లమ్‌ ఏరియాలలో డబ్బుతోపాటు మద్యం అందజేశారు. గురువారం పట్టణం మొత్తం చైర్మన్‌ ఎన్నికలతోపాటు 48 వార్డులకుగాను 46 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. రెండు రోజుల నుంచి మద్యం ఏరులై పారించిన కూటమి నాయకులు, మంగళవారం రాత్రి నుంచి డబ్బు పంపిణీ చేపట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ వారివైపు కన్నెత్తి చూడలేదు. కూటమి అభ్యర్థుల చేతుల మీదుగా రూ.కోట్లు పంపిణీ అవుతున్నా అధికారులు ఒక్క పైసా పట్టుకున్న పాపాన పోలేదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల కదలికలపై పోలీసులతో నిరంతరం నిఘా పెట్టించారు.

మాచర్ల: కారంపూడిలో ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పల్నాటి ఉత్సవాలకు ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పిడుగు చెన్నకేశవ అయ్యవారు, పోతురాజుకు పడిగం కట్టి ఉత్సవాలకు నాంది పలికారు. పల్నాటి చరిత్ర, సంప్రదాయాలు, వీరుల త్యాగాలు స్మరించుకుంటూ ఏటా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పోతు రాజుకు పడిగం కట్టి ప్రారంభించి.. డిసెంబరు 9 నుంచి 12వ తేదీ వరకు కోడిపందేలు, తదితర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. పల్నాటి చరిత్ర ఆకట్టుకునేలా నిర్వహిస్తారు. ఉత్సవాలకు తరుణ్‌ చెన్నకేశవ ప్రారంభించి పల్నాటి చరిత్ర తెలియజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement