గురజాలలో పచ్చ గూండాగిరీ | - | Sakshi
Sakshi News home page

గురజాలలో పచ్చ గూండాగిరీ

Nov 26 2026 1:29 AM | Updated on Nov 26 2026 1:29 AM

గురజాలలో పచ్చ గూండాగిరీ ● ఆర్‌డీఓ కార్యాలయం వద్ద కూటమి నేతల హల్‌చల్‌ ● నామినేషన్ల తిరస్కరణపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లకుండా అడ్డంకులు ● అప్పీల్‌ చేసేందుకు వెళ్లిన సర్పంచి అభ్యర్థి సునీత దంపతులపై దాడి ● గురజాలలో న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు

● ఆర్‌డీఓ కార్యాలయం వద్ద కూటమి నేతల హల్‌చల్‌ ● నామినేషన్ల తిరస్కరణపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లకుండా అడ్డంకులు ● అప్పీల్‌ చేసేందుకు వెళ్లిన సర్పంచి అభ్యర్థి సునీత దంపతులపై దాడి ● గురజాలలో న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: గురజాల నియోజకవర్గంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో గురజాల ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా కూటమి నేతలు బుధవారం హల్‌చల్‌ చేశారు. వందల సంఖ్యలో ఆర్డీవో కార్యాలయం చుట్టుపక్కల కాపు కాసిన కూటమి నేతలు అప్పీల్‌కు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. ఆర్‌డీవో కార్యాలయం ముందు, బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బస్టాండ్‌ సెంటర్‌లో అడుగడుగునా కూటమి నేతలు కాపలా ఉంటూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల కదలికలపై నిఘా పెట్టారు. అప్పీల్‌ చేసేందుకు వస్తే దాడులు చేసేందుకు సిద్ధంగా అక్కడే మకాం వేశారు. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో సజావుగా జరగాల్సిన ఎన్నికలను హింస, బెదిరింపులు, దౌర్జన్యాలతో కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారు.

ఆర్‌డీవో కార్యాలయం వద్దే మకాం

గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి న్యాయస్థానం ద్వారా న్యాయపోరాటం చేసి నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు చాలా పకడ్బందీగా నామినేషన్లు వేసి సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నుంచి చెక్‌లిస్ట్‌లను సైతం తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసిన తరువాత పరిశీలనలో వాటిని తిరస్కరించారు. దీనిపై గురజాల ఆర్డీవోకు అప్పీల్‌ చేసేందుకు నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులంతా బయలుదేరారు. ఈ విషయాన్ని పసిగట్టిన కూటమి నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలను సమీకరించి ఆర్‌డీవో కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఆర్‌డీవో కార్యాలయం చుట్టుపక్కల రాకపోకలు సాగించే వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. నామినేషన్ల తిరస్కరణపై ఒక్కరు కూడా అప్పీల్‌ చేయకుండా అడ్డుకున్నారు. ఆర్‌డీవో కార్యాలయం వద్ద వందల సంఖ్యలో కూటమి నేతలు ఉన్నప్పటికీ పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారు. ఆర్‌డీవో వద్దకు తిరస్కరణకు గురైన అభ్యర్థులు అప్పీల్‌ చేసేందుకు వచ్చినప్పటికీ కూటమి నేతలు తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడంతో అక్కడకు చేరుకోలేకపోయారు.

న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు

గురజాల ఆర్‌డీవో కార్యాలయంలోకి న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో వాటిపై రిటర్నింగ్‌ అధికారిని కలిసేందుకు ఆర్‌డీవో కార్యాలయం వద్దకు న్యాయవాదులు చల్లా రామిరెడ్డి, బండి వీరభద్రుడు, మందపాటి శ్రీనివాసరెడ్డి, కర్రా చిన్న కోటేశ్వరరావు చేరుకున్నారు. న్యాయవాదులను ఆర్‌డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై రిటర్నింగ్‌ అధికారిని కలిసి వస్తామని, దీనిపై తాము కోర్టులో అప్పీల్‌ చేస్తామని న్యాయవాదులు పోలీసులకు చెప్పారు. ప్రస్తుతానికి రిటర్నింగ్‌ అధికారి అందుబాటులో లేరని సాకు చెప్పి అక్కడి నుంచి న్యాయవాదులను వెనక్కి పంపించారు. పోలీసుల తీరుపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement