తెలంగాణ, బిహార్ రాష్ట్రాల నుంచి రెండు బస్సుల్లో కిరాయి వ్యక్తుల తరలింపు కోట సెంటర్‌లోని కల్యాణ మండపంలో కిరాయి మూకల మకాం కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడులకు సన్నాహాలు బూత్‌లలో కూర్చోవద్దంటూ వైఎస్సార్ సీపీ ఏజెంట్లకు బెదిరింపులు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగానికి సవాల్
పోలీసుల రక్షణ ఏదీ?
వైఎస్సార్ సీపీకి పట్టున్న వార్డులపై అధికార పార్టీ గురి
నరసరావుపేట టౌన్: వైఎస్సార్ సీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అధికార టీడీపీ వ్యూహం రచించింది. ఇప్పటికే కిరాయి గూండాలను రంగంలోకి దింపి, కొన్ని బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. కానీ ఆ ఓటునే భయంతో శాసించాలనుకుంటే అది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు దౌర్జన్యానికి దిగడం, ప్రజాతీర్పును ప్రభావితం చేసేందుకు కుట్రలకు తెరతీయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే. నరసరావుపేట పురపాలక ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు పట్టణంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయడం నుంచి పోలింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం వరకు అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి పట్టున్న వార్డులను టార్గెట్ చేసుకుని అక్కడ రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం అధికార పార్టీ గూండాయిజానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
పక్కా ప్రణాళికతో..
నరసరావుపేట పురపాలక సంఘంలో గతంలో 34 వార్డులు ఉండగా, పునర్విభజనతో వాటి సంఖ్య 48కి పెరిగింది. పట్టణ శివారు ప్రాంతాలు సైతం పురపాలక సంఘంలో విలీనం కావడంతో కొత్త ప్రాంతాల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. వీరు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీడీపీ ఘోర పరాజయం పొందుతుందనే భయంతో ఆయా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడం, బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఫలితాలను ప్రభావితం చేయాలనే కుట్ర జరుగుతోంది.
కిరాయి గూండాలను తీసుకొచ్చి...
బిహార్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రెండు బస్సుల్లో కిరాయి వ్యక్తులను రప్పించారని, కోట సెంటర్‌లోని ఓ కల్యాణ మండపంలో వారికి బస ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం పోలింగ్ సమయంలో వీరిని రంగంలోకి దించి, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులు చేయించడం, బూత్‌ల వద్ద భయానక వాతావరణం సృష్టించడం ద్వారా రిగ్గింగ్‌కు పాల్పడాలని కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాడులకు ఆయుధాలసమీకరణ..
కొన్ని వార్డుల్లో పెట్రోల్ బాంబులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు వంటి వాటిని భారీగా సమకూర్చుకున్నట్లు సమాచారం. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో వాటిని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. పోలింగ్ సమయంలో ఘర్షణలు సృష్టించి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బూత్ ఏజెంట్లపై భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తమ బాధ్యతను మరిచి అధికార పార్టీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయగలగాలి. అభ్యర్థులు, ఏజెంట్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించగలగాలి. కానీ, కిరాయి వ్యక్తుల తరలింపు, ఆయుధాల సమీకరణ, బూత్ ఏజెంట్లకు బెదిరింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. ఇకనైనా పోలీసులు పక్షపాత ధోరణిని విడిచిపెట్టి, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


