ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి ● ఎంపీ, కూటమి నాయకులు సహకరించాలి
● పోలీసులు ఇచ్చే నోటీసులకు భయపడేదే లేదు
● విలేకరుల సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించాలని, ఇందుకు కూటమి నాయకులు సహకరించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలు నిష్పక్షపాతంగా వ్యవహరించి రిగ్గింగ్, అక్రమాలు జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తే తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా తాను మాట్లాడినట్లు డీఎస్పీ హనుమంతరావు చెప్పడంలో ఎటువంటి నిజం లేదన్నారు. పోటీ ప్రధానంగా తమ పార్టీకి, కూటమి మధ్యనే ఉంటుందన్నారు. రిగ్గింగ్, దొంగ ఓట్లు వేసేందుకు ఎవరైనా వస్తే వారిని ఎదుర్కొనేందుకు కారం పొట్లాలతో సిద్ధంగా ఉండాలని తాను చెప్పానని, అంతేకానీ ఓటర్లపై దాడి చేయాలని పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమను కనీసం నామినేషన్లు కూడా వేయనీయలేదని ఆరోపించారు. ఎవరైనా నామినేషన్లు వేసేందుకు సాహసిస్తే, బిహార్ నుంచి వచ్చిన వారితో నామినేషన్ కేంద్రాల వద్ద తిష్టవేసిన టీడీపీ మూకలు తమ పార్టీ నాయకులను కొట్టి, పత్రాలను లాక్కొని చించివేశారన్నారు. డీఎస్పీ వచ్చినప్పటికీ నామినేషన్లు వేయనీయలేదని పేర్కొన్నారు.
వినుకొండలో మధ్యాహ్నం నుంచి అన్ని వార్డుల్లో ఏజెంట్లను లాగేసి టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే పరిస్థితి నరసరావుపేటలోనూ జరిగే అవకాశం ఉన్నందునే తాము కారం పొట్లాల విషయం మాట్లాడామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, పోలింగ్ బూత్‌ల నుంచి తమ ఏజెంట్లను లాగేయకుండా, దొంగ ఓట్లు పడకుండా చూడాలని కోరారు. రిగ్గింగ్‌ను అడ్డుకోవాలని మహిళలను కోరామని, పోలింగ్ బూత్‌ల వద్ద తమ పార్టీ నాయకులు ఉండాలని చెప్పడంలో తప్పేమిటని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి హోటళ్లు, కల్యాణ మండపాల్లో ఉంచారన్నారు. వ తనతో పాటు స్థానిక ఎమ్మెల్యేను కూడా హౌస్ అరెస్టు చేయాలని అన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని, ఎక్కడకు పిలిచినా వచ్చి సంజాయిషీ ఇస్తామని స్పష్టం చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ లేకపోతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్
ఇండిపెండెంట్లు అరెస్టుపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు
పురపాలక ఎన్నికల్లో అధికార కూటమికి మద్దతుగా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని రెండో వార్డుకు చెందిన ఇద్దరు ఇండిపెండెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి వీడియో రిలీజ్ చేశారు. ఇది చాలా దుర్మార్గమని, తాము ఖండిస్తున్నామన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని, పోలీసుల చర్యలను ఓటర్లు గమనించాలని విజ్ఞప్తి చేశారు.