మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఇక ప్రత్యక్షం రూ. కోట్లు కుమ్మరిస్తే తప్ప గట్టెక్కలేని పరిస్థితి రిజర్వేషన్ల ఖరారుతో ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ ఎంతైనా పెడతామంటూ పైరవీలు చేస్తున్న ఆశావహులు వైఎస్సార్ సీపీ హయాంలో సామాన్యులకే చైర్మన్ పీఠం
డబ్బుపైనే
కూటమి ఆశలు
సత్తెనపల్లి: మారిన ఎన్నిక విధానంలో రూ.కోట్లు ఉంటే తప్ప మున్సిపల్ చైర్మన్ సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో అత్యధిక కౌన్సిల్ సీట్లు గెలిచిన పార్టీ నుంచి చైర్మన్‌గా ఒకరిని ఎంపిక చేసేవారు. ఈ క్రమంలో సామాన్యులందరూ చైర్మన్లుగా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ తాజాగా మున్సిపాలిటీలో చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సీట్లు హాట్‌గా మారాయి. భారీగా డబ్బులుంటే తప్ప కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వని కూటమి పార్టీలు.. చైర్మన్ సీట్లను ఎంతకు బేరం పెడతాయో ఆలోచించుకోవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ విషయం తెలుసుకున్న కొందరు బడాబాబులు రిజర్వేషన్లు వెలువడటంతో ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ ఫండ్ కింద కొంత.. ఎన్నికల ఖర్చు కోసం ఇంకొంత ... ఓట్లు కొనుగోలు మరి కొంత కలిపి రూ.కోట్లల్లో ఖర్చు చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. తమకే చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించడంతో తమ సామాజిక వర్గం ఓట్లు తమకు కలిసి వస్తాయంటూ తమ బలాలు చెబుతున్నారు. ప్రజల్లో వారికి ఉన్న బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మరి కొంత మొత్తం రాబట్టేందుకు అన్నీ విన్నాక ఎవరికీ హామీ ఇవ్వకుండా ఎమ్మెల్యేలు దాటవేస్తున్నారని సమాచారం.
ధనం, బలం ఉంటేనే..
గతంలో మున్సిపాలిటీల్లో ఉన్న స్థానాల్లో సగం కంటే ఎక్కువ గెలిచిన పార్టీకి చెందిన వ్యక్తి చైర్మన్ అయ్యేవారు. గెలిచిన వారిలో ఎవరో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకునేవారు. కౌన్సిలర్‌గా గెలిచి .. చైర్మన్ పీఠం అధిరోహించే అవకాశం ఉండేది. ఒక వార్డులో ఖర్చు భరించి... పార్టీలో చెలామణి అవుతూ ... పెద్దల ఆశీర్వాదం ఉంటే చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం ఉండేది. ఒక్కోసారి రిజర్వేషన్ కలిసి వచ్చి పదవులు పొందిన వారూ ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి అలా ఉండదు. ప్రస్తుతం చైర్మన్ కోసం ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల ఓటర్ల ఆశీర్వాదం అవసరం. చైర్మన్ కుర్చీ కావాలంటే కనిష్ఠంగా రూ. 5 కోట్లపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో సామాన్యులకు ఇక నుంచి చైర్మన్ పీఠం కలగానే మిగలనుంది. బడాబాబులే చైర్మన్ పదవి కోసం పోటీ చేయనున్నారు.
పెరిగిన సీట్లతో అధిక భారం
గతంతో పోలిస్తే జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిల్ స్థానాల సంఖ్య పెరిగింది. గతంలో జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో 243 కౌన్సిల్ స్థానాలు ఉండగా .. ప్రస్తుతం అవి 295కు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 52 కౌన్సిల్ స్థానాలు ఈ దఫా పెరిగాయి. అన్ని కౌన్సిల్ స్థానాల అభ్యర్థుల ద్వారా ప్రజల ఓట్లు రాబట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఖర్చు రూ. కోట్లకు చేరనుంది. దీంతో సంపన్నులకు భారీగా అవకాశాలు దక్కబోతున్నాయి.
సామాన్యులకు అవకాశమిచ్చిన
వైఎస్సార్ సీపీ
జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలు, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో అన్ని స్థానాలను వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. నరసరావుపేట మున్సిపాలిటీకి కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. అప్పట్లో ఉన్న నిబంధనల ప్రకారం అత్యధిక సీట్లు సాధించి వారిలో ఒకరికి చైర్మన్ పీఠం కట్టబెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి రాజకీయ అనుభవం, నేపథ్యం లేని సామాన్యులకు, మహిళలకు సైతం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. అందులోనూ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు పెద్దపీట వేశారు. అవకాశం లేని చోట్ల వైస్ చైర్మన్లుగా ఒక్కో మున్సిపాలిటీలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ సామాన్యులే చైర్మన్ పీఠం అధిరోహించారు.
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఓటరును అడిగినా.. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం డబ్బుపై ఆధారపడి కూటమి నేతలు ఓటింగ్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో భారీగా డబ్బులు ఉన్న వారికే గాలం వేస్తున్నారు. ఇదే అదునుగా బడాబాబుల్లో ఆశలు మొదలయ్యాయి. ఎవరికి వారుగా ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టారు. ఉదయం ఎమ్మెల్యేను కలిస్తే .. సాయంత్రం వారి కుటుంబ సభ్యులను కలిసి రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉందని, తమకే సీటు కావాలని కోరుతున్నట్లు సమాచారం.


