అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాల చాముండేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవీఖడ్గమాల, లలిత సహస్ర నామార్చన, శ్రీచక్రార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ అన్నపూర్ణాదేవి అలంకార విశిష్టతను వివరించారు. జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రోసూరు: శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని క్రోసూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం అమ్మవారిని రూ.కోటి విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం తరఫున మంగళవారం సారె సమర్పించారు.


