కూటమిలో స్థానిక చిచ్చు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో స్థానిక చిచ్చు

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

గుప్తాకు చైర్మన్‌ టికెట్‌ ఇచ్చేందుకు ఎమ్మెల్యే పావులు పార్టీ కోసం పని చేసిన తమ సంగతేంటంటున్న ఆశావహులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతల సన్నద్ధం చైర్మన్‌ అభ్యర్థి ఎంపికలో జనసేనకు దక్కని ప్రాధాన్యం

జనసేనకు మొండిచేయి?

నరసరావుపేట టౌన్‌: నరసరావుపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కూటమి పార్టీల్లో చిచ్చు రేపుతోంది. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతలతోపాటు కూటమి భాగస్వామ్య పక్షాల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వద్ద తమ గోడు వెళ్లబోసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కూటమిలో ఐక్యతకు పరీక్షగా మారింది. నరసరావుపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవిపై టీడీపీలో పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ కష్టపడి పనిచేశామని, ఎన్నికల్లో ఖర్చుపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని వారు చెప్పుకొస్తున్నారు. తమను కాదని, సాధారణ నేతలకు ప్రాధాన్యం ఇస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగసారపు సుబ్బరాయ గుప్తాకు మరోసారి చైర్మన్‌గా పోటీ చేసే అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నారనే ప్రచారం టీడీపీలో కొత్త వివాదానికి తెరలేపింది. ఇటీవల జరిగిన ఓ సామాజిక వర్గ సమావేశంలో ఈ అంశంపై ఎమ్మెల్యే నేరుగా గుప్తా పేరును ప్రతిపాదించినట్టు ప్రచారం సాగుతోంది. రెండోసారి అవకాశం ఇవ్వడంపై కొందరు నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. అధికారంలో లేని సమయంలో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తికి మరోసారి అవకాశం కల్పిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ఆవేదన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. సొంత సామాజికవర్గ అభివృద్ధికి కూడా గుప్తా చేసిందేమీ లేదంటూ ఆ సామాజికవర్గ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. చైర్మన్‌ ఎంపికలో పార్టీ సేవ, సీనియారిటీ, ప్రజల్లో ఉన్న ఆదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఓ సామాజిక వర్గంలోనూ అసమ్మతి

చైర్మన్‌ పదవి కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు పోటీపడుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. టీడీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ భర్త వాసిరెడ్డి రవి, మాజీ కౌన్సిలర్‌ చేకూరి పుష్పలత తదితరులు తమ వర్గానికి చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్‌ పదవి ఇవ్వాలని, లేదంటే ఎన్నికల్లో తమ సహకారంపై పునరాలోచించాల్సి వస్తుందని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆ సామాజిక వర్గ ప్రముఖ వైద్యుడు, సీనియర్‌ టీడీపీ నేతల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి ఎమ్మెల్యేను సైతం నిలదీసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ నేతల అసంతృప్తి ప్రభావం తప్పదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇచ్చిన మాట ఏమైంది..

బంగారం వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌ కూడా చైర్మన్‌ పదవిని ఆశించిన వారిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అరవిందబాబు గెలుపునకు ఆయన కృషి చేశారని, ఈ క్రమంలో చైర్మన్‌ పదవిపై హామీ లభించిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ప్రస్తుతం గుప్తాకు అవకాశం కల్పించాలన్న ఆలోచన తెరపైకి రావడంతో విజయకుమార్‌ వర్గంలో అసంతృప్తి రాజుకుంది. మున్సిపాలిటీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించకుండా గుప్తా పేరును ప్రకటించడంపై విజయకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

జనసేనకు చైర్మన్‌ పదవి దక్కుతుందన్న ఆశతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్‌ జిలానీ ఉన్నారు. కానీ అసలు ప్రాధాన్యం లభించకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లోనూ నిరాశ నెలకొంది. ఒకవైపు టీడీపీలోనే ఆశావహుల మధ్య పోటీ, మరోవైపు జనసేన ఆశలు నెరవేరకపోవడం.. కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అవసరమైతే టీడీపీ అధిష్ఠానం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హామీలు నెరవేర్చకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంటింటి ప్రచార కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. నిత్యావసర సరకుల ధరల పెరుగుదల చెమటలు పట్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement