కేవలం రెండు వారాల్లో 25 శాతం పెరుగుదల చర్యలు తీసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం
నరసరావుపేట: జిల్లాలో బియ్యం ధరలు మండిపోతున్నాయి. అవి ఎంతగానంటే సామాన్యులకు అందని స్థితికి చేరాయి. ప్రీమియం పాతిక కేజీల బియ్యం బస్తా రూ.2,100 కు చేరింది. అంటే కేజీ రూ.80 కుపైగా పలుకుతోంది. మిగతా రకాల బియ్యం రేట్లు రూ.వందకు అటు ఇటుగా ఉన్నాయి. ఇంత రేటు ఏనాడూ చూడలేదని పలువురు వాఖ్యానిస్తున్నారు. రకరకాల బ్రాండ్‌ల పేరుతో వ్యాపారులు 25 , 26 కేజీల బస్తాలు విక్రయిస్తున్నారు. కర్నూలు రైస్ పేరుతో విరివిగా ప్రతిచోటా లభించే బియ్యం బస్తా కూడా రూ.2 వేలు చెబుతున్నారు. ఐదు నెలల క్రితం ప్రీమియం 26 కేజీల బస్తా ధర రూ.1450, మూడు వారాల క్రితం రూ.1700 ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.2,100 చెబుతున్నారు.
మొద్దునిద్రలో చంద్రబాబు సర్కార్
టీడీపీ ప్రభుత్వం బియ్యం ధరలు తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గతేడాది పండించిన వరిసాగులో రైతులు అమ్ముకోగా మిగిలిన ధాన్యం 76 కేజీల బస్తా రూ.3,200 నుంచి రూ.3,300కు కొనుగోలు చేస్తున్నారు. అవి రైతుల వద్ద చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో 6,118 హెక్టార్లలోనే వరి సాగైందని జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు గత నెల సమీక్షలో జిల్లా కలెక్టర్‌కు తెలియచేశారు. గతేడాది ఎల్‌నినో ప్రభావం జిల్లాపై లేదు. వరిసాగు సాధారణంగానే ఉంది. రైతులు పండించిన ధాన్యం కల్లాల్లో క్వింటా రూ.1,200, రూ.1,300కే అమ్ముకున్నారు. ఈ ఏడాది వరి సాగు చేయవద్దని, చేసినా సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించింది. కాగా, పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన బియ్యం కౌంటర్లు ఎక్కడా సక్రమంగా పనిచేయట్లేదు. వాటి ఊసేలేదు. దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాదును వివరణ కోరగా బియ్యం ధరలను అదుపు చేసేందుకు సన్నరకం బియ్యం కేజీ రూ.48కే విక్రయించబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియచేసినట్లు చెప్పారు. సత్తెనపల్లి రోడ్డులోని మణికంఠ రైస్‌మిల్లులో ప్రీమియం బస్తా రూ.1,700కే ఇస్తున్నారని, అదే రోడ్డులోని ఆవులసత్రం వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్‌లో బియ్యం తక్కువ ధరకే లభ్యం అతున్నాయని పేర్కొనటం గమనార్హం.


