మాచర్ల: శ్రీశైలం–మాచర్ల హైవే నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఎం.ఫణీంద్రరెడ్డి (31) పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో రింగ్ రోడ్డు సెంటర్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫణింద్రరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. ఘటనపై పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. యువకుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
వాహనం ఢీకొని వ్యక్తి..
మాచర్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన సంఘటన ఆదివారం మాచర్ల పట్టణ శివారులోని రాయవరం జంక్షన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారంపూడి మండలంలోని మిరియాల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు గోగిరెడ్డి కోటిరెడ్డి (45) మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలోని మైసమ్మ గుడి వద్దకు పూజలకు వచ్చి తిరిగి తన బైక్‌పై వెళుతుండగా.. గుర్తు తెలియని వాహనం బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనలో కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా.. స్థానికులు అతనిని 108 ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ఆసుపత్రికి రిఫర్ చేయగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బయో డీజిల్ కంపెనీలో విషాదం
సంపులో పడి కార్మికుడి మృతి
మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల కై లాసగిరిలో ఉన్న బయో డీజిల్ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. కంపెనీలో కెమికల్ అనాలసిస్ ల్యాబ్ వర్కర్‌గా పనిచేస్తున్న పోపూరి యశ్వంత్ (33) విధుల్లో ఉన్న సమయంలో బాత్రూంకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు సంపులో పడటంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో మృతుడి బంధువులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చి, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డీజిల్ దొంగల ముఠా అరెస్ట్
మంగళగిరి రూరల్: రాజధాని ప్రాంతంలో నిర్మాణ యంత్రాలు, నిలిపి ఉంచిన లారీల నుంచి సుమారు 500 లీటర్ల డీజిల్ చోరీ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులు ఉయ్యూరు ఉమామహేశ్వర్‌రెడ్డి (నిడమర్రు), మేకల రాజు (నవులూరు), పంతంగాని శీను (ఇబ్రహీంపట్నం)గా గుర్తించారు. నిడమర్రు నుంచి తాడికొండ వెళ్లే రహదారిలోని ఓ షెడ్‌లో డీజిల్ లోడింగ్, అన్‌న్‌లోడింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.


