బహిరంగ వేలం నిర్వహిస్తే రూ.50 లక్షలకుపైగా ఆదాయం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో లీజు వ్యవహారం పేరుకే మత్స్యకార సంఘాలు.. పెత్తనమంతా వారిదేనని ఆరోపణలు
భూగర్భ జలాలపై ప్రభావం
నూజెండ్ల: ఊరి ఉమ్మడి ఆస్తులైన ఊరి చెరువులు గ్రామాభివృద్ధికి కాకుండా అధికార పార్టీ నాయకుల స్వార్థానికి పెట్టుబడులుగా మారుతున్నాయి. మత్స్యకార సంఘాల పేరుతో చెరువులపై పెత్తనం చేస్తూ, లీజుదారులతో కలిసి రూ.కోట్లు కూడబెడుతున్నారు. మండల కేంద్రమైన నూజెండ్ల ఊరి చెరువు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దశాబ్దాల కాలంగా చెరువును మత్స్యకార సంఘాల జీవనోపాధి కోసం కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తోంది. పేరుకు సంఘం సభ్యులు ఉన్నా, ఏనాడూ వారు చేపలు పట్టింది లేదు. సంఘాల ముసుగులో పెద్దలు, లీజుదారులు పెత్తనం సాగిస్తూ ప్రజల సొమ్ముకు భారీగా గండి కొడుతున్నారు. అనధికారికంగా లీజుదారుల చేతుల్లోనే చెరువు నిర్వహణ సాగుతోంది.
భారీగా సంపాదన
ఈ ఏడాది చెరువులో చేపల పెంపకం ద్వారా రూ.2 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. గ్రామాభివృద్ధికి రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయం. ఇదే చెరువును బహిరంగ వేలం వేస్తే రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందనేది బహిరంగ రహస్యం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ గుత్తాధిపత్యానికి గండికొట్టారు. ప్రతి ఏడాది చెరువు ఆదాయం నుంచి రూ.18 లక్షలు గ్రామానికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు దోచుకుంటున్నారు.
మార్పు రావాల్సిందే...
చెరువులను నింపేందుకు ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి ఇటీవల నీటిని విడుదల చేసింది. చేపలు పట్టే సమయం కావడంతో లీజుదారులు చెరువును నింపేందుకు విముఖత చూపడంతో అధికారులు సైతం ఆ ప్రయత్నాలు చేయలేదు. దీంతో చెరువు కింద సాగు, గడ్డి పెంపకం అసాధ్యంగా కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో చెరువు ఎండిపోతే ఎలాగని పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకతీతంగా స్థానిక శాసనసభ్యుడు జి.వి. ఆంజనేయులు చెరువు ఆదాయంపై దృష్టి సారించి, గ్రామాభివృద్ధికి బాట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.
చేపలు పట్టేందుకు నీటిని వదులుతుండటంతో పశుగ్రాసానికి ఇబ్బందులు పడుతున్నాం. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో నీటిని వదిలితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది. చెరువు ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి మళ్లిస్తే ఇతర ప్రభుత్వ నిధులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
– అమ్మిరెడ్డి బుజ్జిరెడ్డి, గ్రామస్తుడు


