చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేటలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కారు డ్రైవర్ మృతి చెందాడు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన తన్నీరు శ్రీహరి (33) మంత్రి గొట్టిపాటి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై పట్టణ పరిధిలోని కొత్త బైపాస్ నుంచి పురుషోత్తమపట్నం వైపు వెళుతున్నాడు. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు మలుపు తిరుగుతున్న సమయంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. శ్రీహరి తీవ్రగాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలో శ్రీహరి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి అంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


